-నోడల్ అధికారులు ఎన్నికల విధుల నిర్వహణకు సన్నద్ధం కండి…
-కేటాయించిన విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి…
-ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయి పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్…
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బృంద స్ఫూర్తి, పటిష్ట సమన్వయంతో నోడల్ అధికారులు విధులు నిర్వర్తించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. ఢిల్లీరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీరావు సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులకు కేటాయించిన విధుల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికలకు సంబంధించి కేటాయించిన విధుల్లో అలసత్వం లేకుండా నిర్దేశించిన సమయంలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధులలో భాగంగా వివిధ విభాగాలకు 16 మంది నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మ్యాన్ పవర్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ట్రైనింగ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన శిక్షణ నిర్వహించాల్సిన వేదికలు, మెటీరియల్ ను సిద్ధం చేసుకోవలసి ఉంటుందన్నారు. మెటీరియల్ మేనేజ్ మెంట్ కు సంబంధించి మెటీరియల్ పంపిణీలో పక్కాగా రికార్డులు నిర్వహించాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్ లో అధికారులకు వాహనాలను సమకూర్చే విధంగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్) లో భాగంగా అర్బన్ లోని మూడు నియోజకవర్గాలలో 80 శాతంకు పైగాను, మిగిలిన నాలుగు నియోజకవర్గాలలో 90 శాతం మొత్తంగా సరాసరి 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా ప్లాన్ రూపొందించాలన్నారు. ఈవియం మేనేజ్ మెంట్ లో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తైనా తరువాత నియోజకవర్గాలకు పంపిణి చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందన్నారు. కమ్యూనికేషన్ ప్లాన్ లో భాగంగా జిల్లాలో ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే విధంగా అన్ని శాఖలకు చెందిన అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ నిర్వహణపై పలు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, అబ్జర్వర్లు తదితర అంశాలపై ఆయా నోడల్ అధికారులు పూర్తీ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ నోడల్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వోలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందింస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించుకొని జిల్లాకు ఎన్నికల నిర్వహణలో మంచి పేరు తీసుకురావాలన్నారు.
అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ నగర పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతో సిద్ధంగా ఉన్నామన్నారు. నెల రోజుల నుండే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని ఇసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అక్రమ నగదు, లిక్కర్ ను సీజ్ చేస్తున్నామన్నారు. ఆర్మడ్ ఫోర్సెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సమావేశంలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సిహెచ్. నాగలక్ష్మి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.