– ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి.
– పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించడానికి కృషిచేద్దాం.
– ఇంకా ఎవరైనా ఉంటే ఫారం-6 ద్వారా వెంటనే ఓటు నమోదుచేసుకునేలా చూడాలి
– క్యాంపస్ అంబాసిడర్స్ స్వీప్ వర్క్‌షాప్‌లో కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన విశిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థ ఫలాలను అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నామని.. ఈ గొప్ప వ్యవస్థ పరిపుష్టతకు ఎన్నికలు కీలకమైనవని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతం పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో కీలక భాగస్వాములు కావాలని కలెక్టర్ డిల్లీరావు.. క్యాంపస్ అంబాసిడర్స్‌కు పిలుపునిచ్చారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం-భాగస్వామ్యం చేయడం (స్వీప్) కార్యక్రమంలో భాగంగా క్యాంపస్ అంబాసిడర్స్ (పాఠశాలలు, కళాశాలలు) వర్క్‌షాప్ శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగింది. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు నైతిక విలువలతో కూడిన ఓటింగ్ ముఖ్యమన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే విజయవాడ అర్బన్ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైందని.. ఈ నేపథ్యంలో విజయవాడ అర్బన్‌లో 85 శాతానికి పైగా ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. క్యాంపస్ అంబాసిడర్లు తమ విద్యా సంస్థల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యం గురించి తెలియజెప్పి.. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకుల భాగస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుందని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
ఓటు నమోదుకు సువర్ణావకాశం:
అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఓటరు జాబితాలో నమోదు కాకుండా ఉంటే వెంటనే ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేయించుకునేలా చూడాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. సాధారణ ఎన్నికలు-2024కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల వరకు ఓటర్ల జాబితాలో డిలీషన్స్, కరెక్షన్స్‌కు అవకాశముంటుందని.. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ (నామినేషన్ల ప్రారంభం వరకు) వరకు చేర్పులు, బదిలీలకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని అంబాసిడర్స్ గుర్తించాలంటూ ఫారం-6, ఫారం-7, ఫారం-8ల ప్రయోజనాల గురించి వివరిచారు. ఓటర్ హెల్ప్‌లైన్, ఫిర్యాదుకు వీలుకల్పించే సీవిజిల్ తదితర ఆన్‌లైన్ వేదికలపై కూడా అవగాహన పెంపొందించుకొని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయాలన్నారు. క్యూఆర్ కోడ్‌తో ఉండే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను కూడా ఓటర్లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ-ఎపిక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రజాస్వామ్య పండగలా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సమాజంలోని అందరం భాగస్వాములవుదామని కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు.
అందుబాటులో అన్‌లైన్ వేదికలు: స్వీప్ నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు
ఆధునిక సాంకేతికత అందరికీ చేరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ వివిధ యాప్స్, పోర్టల్స్‌ను అందుబాటులో ఉంచిందని.. వీటిపై అవగాహన పెంపొందించుకొని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఈవో కేవీఎన్ కుమార్, జిల్లా ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా. కె.రమేష్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.