– సరైన విధంగా రోజువారీ నివేదికలు సమర్పించడం ముఖ్యం
– అధికారుల మధ్య బృంద స్ఫూర్తి, సమన్వయం కీలకం
– ఈఈఎం శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ స్ఫూర్తితో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల వ్యయ నిర్వహణ (ఈఈఎం) విధులను నిష్పక్షపాతంగా, నిబద్ధతతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు.
శనివారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాధారణ ఎన్నికలు-2024కు సంబంధించి ఎన్నికల వ్యయ నిర్వహణపై ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కమిటీ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎన్నికల వ్యయ నిర్వహణకు సంబంధించిన బృందాల విధులకు సంబంధించిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివేదికలు సమర్పించాల్సిన తీరు తదితరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నగదు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ తదితరాలను సీజ్ చేయడానికి సంబంధించిన నిబంధనలతో పాటు ఎన్నికల నైతిక నియమావళి (ఎంసీసీ) ఉల్లంఘనల విషయంలో వివిధ బృందాలు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈఈఎం బృందాలు విధులపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకొని బృంద స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. థియరీతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞాన సముపార్జన ప్రధానమన్నారు. వివిధ బృందాలు జిల్లా నోడల్ అధికారులకు రోజువారీ నివేదికలను సరైనవిధంగా పంపించడం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించే క్రమంలో ఈసారి కొత్తగా ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్)ను ఈసీఐ రూపొందించినట్లు తెలిపారు. ఈ ఆన్‌లైన్ వేదిక వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమష్టిగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహిద్దామని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీసీపీ కృష్ణకాంత్ పటేల్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ట్రైనర్ చక్రపాణి, ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, పి.సాయిబాబు, కె.మాధవి, కేఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.