విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోయిందని, ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందన్నారు. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలా కుదుపులేమీ లేవన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జారిపోయారని.. ఇక ముందుంది మొసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఓవైపు సొంత పార్టీ నేతలు వెళ్లిపోతుండటం.. మరోవైపు టీడీపీ-జనసేన బలైమన అభ్యర్థులను ప్రకటించడంతో జగన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు . టీడీపీ-జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలు కంగారు పడుతున్నారన్నారు. ఈ కారణంగానే సజ్జల రామకృష్ణ తెరమీదకు వచ్చి అవాకులు చవాకలు పేలారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సీటును ప్రకటించలేదన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పొత్తులు, తమ సీట్ల గురించి వైసీపీ నేతలు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారంటే వారు భయపడుతున్నట్లే కదా అని అన్నారు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు.. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా? అని బోండా ఉమ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను చేసిన తప్పులకు బదిలీల పేరుతో ఇప్పటికే 77 మందిని బలి చేశారని, మళ్లీ మళ్లీ మారుస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధించి.. జగన్ పాలనకు స్వస్తి పలకడం ఖాయం అని అన్నారు. జగన్‌ను వైసీపీ నేతలు నోరు పారేసుకోవద్దని బోండా ఉమ హితవు చెప్పారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …