-ప్రపంచ వేదికపై సాంప్రదాయ కళను ప్రోత్సహించేలా ఏర్పాటు
-పెవిలియన్ ప్రారంభించిన చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత
-పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించేలా ఆప్కో, లేపాక్షి స్టాల్స్ ఏర్పాటు
డిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్ 2024లో సోమవారం ఆంధ్రప్రదేశ్ తన పెవిలియన్‌ను ఆవిష్కరించింది. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పెవిలియన్ ను ప్రారంభించగా, అది రాష్ట్రం యొక్క గొప్ప వారసత్వం, శక్తివంతమైన వస్త్ర పరిశ్రమకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లా నుండి ప్రత్యేకమైన చేనేత, హస్తకళలను ప్రదర్శించే అద్భుతమైన ప్రదర్శనగా తమ పెవిలియన్ ను తీర్చిదిద్దామన్నారు. హస్తకళ యొక్క వైవిధ్యాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేస్తూ సాంప్రదాయ కళలను ప్రోత్సహించడానికి రాష్ట్ర కట్టుబడి ఉందన్నారు. ఇది కేవలం ప్రముఖ వస్త్ర ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా వ్యాపారం, పెట్టుబడికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కూడా నిలుస్తుందన్నారు.
చేనేత జౌళి శాఖ కమీషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పలు టెక్స్టైల్ యూనిట్లు ఎపి పెవిలియన్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయన్నారు. చేనేత, హస్తకళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కొనుగోలుదారులు, ఔత్సాహికులు ఏపీ పెవిలియన్‌కు తరలివస్తున్నారన్నారు. ఆప్కో ఎండి పవన మూర్తి మాట్లాడుతూ భారత్ టెక్స్ 2024లోని ఎపి పెవిలియన్ కేవలం ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. టెక్స్టైల్స్ యొక్క శక్తివంతమైన ప్రదర్శనతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర దృక్పథాన్ని తమ పెవిలియన్ ప్రదర్శిస్తుందన్నారు. కార్యక్రమంలో లేపాక్షి ఇడి విశ్వమోహన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ టెక్స్ 2024 భారతదేశంలో అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్టైల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం, భారత టెక్స్టైల్ రంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. ఇది బి2బి, బి2జి ఈవెంట్ గా ఉంది. ఇది వస్త్ర పరిశ్రమ యొక్క మొత్తం స్పెక్ట్రమ్‌ను ప్రదర్శిస్తుంది.