-గృహేతర అవసరాలకు డొమెస్టిక్ ఎల్ పి జీ వినియోగం నిషిద్దం
-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్యాస్ ఏజెన్సీల వారు గ్యాస్ సిలండర్ల వినియోగంలో వినియోగదారుల భద్రత, సౌలభ్యం నిమిత్తం ప్రభుత్వం వారు నిర్దేశించిన నియమ నిభందనలను తప్పక పాటించుట, ఈ కేవైసి చేయుట పై వినియోగదారులకు అవగాహన కల్పించుట అత్యంత అవశ్యం అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కోన్నారు. మంగళవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్స్ ఏజెన్సీ ప్రతినిధులతో పౌర సరఫరాలు శాఖా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ , గ్యాస్ , ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ చేయు ఏజెన్సీస్ వారందరూ గ్యాస్ సిలిండర్ల డెలివరీ చేయు విధానంలో పోర్టబులిటీ విధానం అమలు చేయుట ద్వారా వినియోగదారులుకు త్వరితగతిన సేవలు అందించాల్సి ఉందన్నారు. ఆ క్రమంలో ” ఈ కెవైసి ” కోసం వినియోగదారులను గ్యాస్ ఏజెన్సీల వద్దకు రప్పించకుండా, వారి ఇంటి వద్ద మాత్రమే గ్యాస్ సిలిండరు డెలివరీ చేయు సమయంలో డెలివరీ బోయ్ సదరు యజమాని యొక్క ” ఈ కెవైసి ” నమోదు చేయాలని ఆమేరకు సంభందిత డెలివరీ బాయ్స్ కి సూచనలు చేయాలన్నారు.గ్యాస్ సిలిండరు డెలివరీచేయునపుడు అదనపు చార్జీలు వసూలు చేయకూడదని పేర్కొన్నారు. డెలివరీ సమయంలో గ్యాస్ రీఫిల్ బరువు , సీల్ నిర్దారణ చెయ్యడం, గుగూల్/ఫోన్ పే/ పేటియం వగైరా డిజిటల్ విధానంలో చెల్లింపులు కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. తప్పనిసరిగా రశీదు జారీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఉజ్వల (PMUY) గ్యాస్ కనెక్షన్స్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చెయ్యాల్సిఉందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లును గృహ అవసరాలకు తప్ప వేరే వాటికి డెలివరీ చెయ్యకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, 26 మంది గ్యాస్, ఆయిల్ ఏజెన్సీ ప్రతినిథులు పాల్గొన్నారు.