మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు మేలు కలిగేలా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ ల నిర్వహణ పనులు సాగునీటి విడుదలకు ముందుగానే చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో స్పందన మీటింగ్ హాల్లో జరిగింది. జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలు కమిటీ చైర్మన్ ,సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రేయిన్ల నిర్వహణ పూడిక తీత పనులు సాగునీటి కాలువలకు నీటి విడుదలకు ముందుగానే చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సభ్యులు కోరారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు వచ్చే నెలలో రైతులకు పంపిణీ చేయాలని కోరారు. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు అందలేదని పలు గ్రామాల్లో రైతులు చెబుతున్నారని, ధాన్యం డబ్బులు రైతులకు సకాలంలో అందించాలని కమిటీ సభ్యులు సమావేశం లో చైర్మన్ సభ్యులు కోరారు. సైక్లోన్ వల్ల రంగు మారిన, తడిసిన ధాన్యం రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారని, కాని డబ్బులు సకాలంలో పడడం లేదని, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ ఆగిపోయిందని, సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మైనర్, మీడియం డ్రైన్లలో పూడికతీత పనులు నరేగా ద్వారా చేపట్టుటకు జిల్లాలో 106 గ్రామాల్లో పనులు గుర్తించడం జరిగిందని, ఈ పనులు రు.9.73 కోట్లతో చేపట్టుటకు జిల్లా కలెక్టర్ మంజూరు చేశారని, తద్వారా నరేగా క్రింద పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మిగతా గ్రామాల్లో కూడా పనులు గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించుటకు ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లో రైతులకు డబ్బులు అందే అవకాశం ఉందన్నారు. తడిసి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు గైడ్లైన్స్ వచ్చాయని, వాటి ప్రకారం రైతులకు డబ్బులు సకాలంలో అందించుటకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఆక్వా రైతుల కరెంటు సబ్సిడీ సంబంధించి 149 పాత కనెక్షన్లకు, 250 కొత్త కనెక్షన్లకు పెండింగ్ ఉందని, సబ్సిడీ చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పాడి రైతులకు పశు నష్టం చెల్లింపులు పెండింగ్ రైతులకు కొంతమేర చెల్లించడం జరిగిందని, మిగతా మొత్తం చెల్లింపునకు కృషి చేస్తామన్నారు. నీటి తీరువ వసూళ్లకు సంబంధించి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పట్టపు శ్రీనివాసరావు శ్రీకాకుళం నాగేశ్వరరావు తదితరులు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, సివిల్ సప్లయిస్ డి ఎం తోట సతీష్, డి సి ఓ ఫణి కుమార్, మార్కెటింగ్ ఎడి ఎల్ నిత్యానందం, జిల్లా ఉద్యానాధికారి జే. జ్యోతి, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.