మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు, అదేవిధంగా ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ డివిజన్లలోని 5 పరీక్షా కేంద్రాలలో 973 మంది 10వ తరగతి, అదేవిధంగా 8 పరీక్ష కేంద్రాలలో 1,803 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలు సవ్యంగా సాగేందుకు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలయ్యే విధంగా చూడాలని, పరీక్షా కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూములు, మూల్యంకన కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఎలాంటి మైక్రో జిరాక్స్ లేదా జిరాక్స్ షాపులు తెరవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన మందులతో సంచార వాహనాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఆయన కేంద్రాల వద్ద విద్యుత్ కు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాలకు ఫోన్లు అనుమతి లేదని, ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడే విద్యార్థులపై పరీక్షా చట్టం 25/1997 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెర సుల్తానా, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎం.డేవిడ్ రాజు, సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు, విద్యుత్ శాఖ ఏఈ పి.సునీల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏ ఎస్ పి ఐ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.