-స్పష్టమైన సమాచారంతో ఆధార్ కార్డులు..
-జి.ఎస్.డబ్ల్యు.ఎస్. అధికారి కొడాలి అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు వివిధ రకాల సేవలను సరళతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ మంజూరుకు స్పష్టమైన దోష రహిత సమాచారం పొందుపరచడంలో ప్రతి ఉద్యోగి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ విభాగ కార్యదర్శి కొడాలి అనురాధ అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలలో అందిస్తున్న ఆధార్ సేవలు మరింత నాణ్యతగా అందించేందుకు జిల్లాలోని డిజిటల్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు నగరంలోని ఐవీ ప్యాలెస్ లో సోమవారం నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆధార్ అనేది ప్రతి పౌరుడికి ఎంతో కీలకమైన గుర్తింపుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తుల పేర్లు, చిరునామా, ఫోన్ నెంబరు, చిరునామా మార్పు, నవజాత శిశువులకు ఆధార్ కార్డు ఇచ్చే సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు విషయంలో తప్పిదాలు జరగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. కొన్ని సందర్భాలలో అతి చిన్న పొరపాట్లు కూడా పౌరులకు తీవ్రమైన ఇబ్బందులను కలగజేస్తాయనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన సమయాలలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, చిన్న చిన్న మరమ్మతులు కూడా ఉద్యోగులు తెలుసుకోవాలన్నారు. శిక్షణ అధికారి జి. గిరిధర్ మాట్లాడుతూ ఆధార్ కార్డు ప్రారంభమైన తొలినాళ్లలో కంటే ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎంతో క్లిష్ణతరమైన ఒకప్పటి సాఫ్ట్వేర్ కంటే ప్రస్తుతం చాలా తేలికగా ఆపరేట్ చేయగలిగేలా ఉందన్నారు. ఆధార్ కార్డులో చేర్పులు, మార్పులు, కొత్త కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత వంటి విషయాలలో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంలో పాటించాల్సిన సురక్షిత విధానాలను ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలన్నారు. ఒకసారి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి తిరిగి అతని కార్డులో ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే సంబంధిత ఉద్యోగి అనుసరించాల్సిన విధి విధానాలలో నిర్లక్ష్యం లేకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయాలలో సేవలు పొందేందుకు వచ్చే పౌరులకు అందించే సేవలు పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం ద్వారా ఉద్యోగులు అందించే సేవలు మరింత వేగంగా అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణా శిబిరంలో ఉద్యోగులు నేర్చుకున్న ప్రతి అంశాన్ని పౌరులకు సేవలందించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో ఆంగ్లం, తెలుగు భాషల్లో టైపింగ్ చేసే క్రమంలో తప్పులు దొర్లినప్పుడు అవసరమైన మెళకువలను తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఆధార్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించేకునేలా ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోడాలి అనురాధ కోరారు.
ఈ శిక్షణా శిబిరంలో జిల్లా నుంచి 121 మంది గాను 113 మంది ఉద్యోగులు హాజరయ్యారు. జి.ఎస్.డబ్ల్యు.ఎస్. ఆధార్ స్టేట్ కోఆర్డినేటర్ వి. సుందరం, ఏపీ ఆన్లైన్ జిల్లా కోఆర్డినేటర్ వై.వి. సురేష్ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.