రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్య సంరక్షణలో అధిక ఖర్చులను తగ్గించడం కోసం అందరికీ, ముఖ్యంగా పేదలకు తక్కువ ధరలకు నాణ్యమైన మందులను అందించడమే లక్ష్యంగా ఈ జన్ ఔషధి కేంద్రాలు జెనరిక్ ఔషధాలను అందించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామములో గల హుకుంపేట ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బొప్పన సావిత్రమ్మ పాఠశాల ప్రక్కన రు.7 లక్షల రూపాయలతో నిర్మించిన భవనంలో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రమును మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ జనఔషధి కేంద్రములో ఎంతో నాణ్యమైన మందులు తక్కువ ధరలకే అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాల్లో విక్రయించే మందులు ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలకు సమానమైన నాణ్యత మరియు సమర్థత కలిగి ఉంటాయన్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఇతర మెడికల్ షాపుల రేట్ల కంటే జనఔషధి కేంద్రములో సరసమైన ధరలకు అందుబాటులో లభ్యమవుతాయన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనఔషధి మందులను వినియోగించుకుని సహకార సంఘం అభివృద్ధిని కాంక్షించాలని డిసిసిబి చైర్మన్ ఆకులు వీర్రాజు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమమునకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నోడల్ ఆఫీసర్ శ్రీమతి. ఎన్. ఉమారాణి , హుకుంపేట సొసైటీ చైర్ పర్సన్ బొప్పన సుబ్బారావు, సంఘ ముఖ్యకార్యనిర్వాహణాధికారి బొడ్డేడ రాంబాబు,తొర్రేడు సొసైటీ అధ్యక్షులు చిట్టూరి వెంకటరావు ,స్థానిక నాయకులు చీరా రాజు, ఏలూరి లోకేష్, నక్కా రాజబాబు , రాజవోలు సొసైటీ అధ్యక్షులు గిరిజాల రామకృష్, అధికారులు స్థానిక ప్రజలు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.