– వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించడంలో నైతిక ప్రమాణాలు, నియంత్రణలు పాటించడం ద్వారా వినియోగదారులకు రక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని వినియోగదారుల కోసం న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారుల విశ్వాసాన్ని పొందేందుకు, దానివల్ల ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు కృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యమన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ విషయంలో వివిధ శాఖలు వినియోగదారుల సంఘాలు, సంస్థల కీలక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని సూచించారు. దేశంలో వినియోగదారుల హక్కుల రక్షణకు బలమైన చట్టాలున్నాయని.. 1986 చట్టంతో పోల్చితే వినియోగదారు రక్షణ చట్టం-2019లో వినియోగదారుల రక్షణకు మరింత దోహదం చేసే అంశాలు చేరాయన్నారు. వినియోగదారు వివాదాల పరిష్కార వ్యవస్థలు క్రియాశీలంగా పనిచేస్తూ త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరిస్తుస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ 1800-11-4000 లేదా 1915, రాష్ట్ర వినియోగదారుల సహాయ కేంద్రం 1800 425 0082 లేదా 1967 అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై వివిధ వర్గాలకు అవగాహన కల్పించడం జరుగుతోందని.. పాఠశాలల్లో ఏర్పాటుచేసిన కన్జ్యూమర్ క్లబ్స్ విజయవంతంగా నడుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆన్‌లైన్ మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాప్‌ల డౌన్‌లోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
ఫిర్యాదుల సత్వర పరిష్కారం: జిల్లా వినియోగదారు కమిషన్ ప్రెసిడెంట్ ఎన్.చిరంజీవి
జిల్లా వినియోగదారు కమిషన్ ప్రెసిడెంట్ ఎన్.చిరంజీవి మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నప్పటికీ బిల్లులు, వారంటీ, గ్యారెంటీ కార్డులను భద్రపరుచుకోవాలని.. విధివిధానాలు షరతులను చదవాలని సూచించారు. డాక్యుమెంట్లు సరిగా ఉంటే వినియోగదారు వివాదాల కేసుల్లో సత్వరం పరిహారం అందేందుకు వీలవుతుందన్నారు. గత ఏడాదిన్నర కాలంలోనే 400కు పైగా వివాదాలను పరిష్కరించామని తెలిపారు. రెండు కోట్ల రూపాయలకు పైగా పరిహారాన్ని వినియోగదారులు పొందడం జరిగిందన్నారు. వినియోగదారులు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని.. ఇప్పుడు జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి కమిషన్‌ల ద్వారా సత్వరం వివాదాలు పరిష్కారమవుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారు కమిషన్ సభ్యులు ఏవీ రమణ.. వినియోగదారుల హక్కులు, ఫిర్యాదు విధానం తదితరాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా డీసీపీసీ సభ్యులు డా. తరుణ్ కాకాని ఓ కేసులో వినియోగదారునికి బీమా కంపెనీ నుంచి పరిహారం అందిన విధానాన్ని వివరించారు. కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథి, అతిథులు వినియోగదారులకు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలయజేస్తూ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. వినియోగదారు కమిషన్ కార్యాలయ ఆధునికీకరణకు నిధులు కేటాయించి, సహకరించడంతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు విశేష కృషిచేస్తున్నందుకు కలెక్టర్ డిల్లీరావును జిల్లా వినియోగదారు కమిషన్ ప్రెసిడెంట్ ఎన్.చిరంజీవి, సభ్యులు ఏవీ రమణ సత్కరించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మోహన్‌బాబు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఏఐసీపీవో స్టేట్ ప్రెసిడెంట్ కె.సురేష్, వినియోగదారు సంస్థలు, సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.