– అత్యంత పారదర్శకంగా ఫారాల పరిష్కారం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ డిల్లీరావు బదులిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వస్తుందన్నారు. జనవరి 22న తుది జాబితా ప్రచురణ అనంతరం వచ్చిన ఫారం-6, ఫారం-7, ఫారం-8లను ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల వరకు ఓటర్ల జాబితాలో తొలగింపులు (డిలీషన్స్), మార్పుల (కరెక్షన్స్)కు అవకాశముంటుందని.. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ (నామినేషన్ల వరకు) వరకు చేర్పులు (ఇన్‌క్లూజన్), బదిలీలు (షిఫ్టింగ్)కు అవకాశం ఉంటుందని వివరించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భవనాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలోనూ వీటికి సంబంధించి చర్చించడం జరిగిందని.. వారు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు చేర్చి భద్రపరచడం, అనంతరం వాటిని కౌంటింగ్ కేంద్రాలకు చేర్చడం, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు వివరించారు.