విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల చేతికే అధికారం ఇచ్చి వారి అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని ప్రజా అధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మూలింటి సుదర్శనమ్ తెలిపారు. ప్రజా అధికార పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మూలింటి సుదర్శనమ్ మాట్లాడుతూ నేటి రాజకీయ పార్టీల వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా అధికార పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బహుజన సమాజ్ పార్టీని నిర్మించి అక్కడ బహుజనులకు రాజ్యాధికారం వాళ్ల చేతుల్లో పెట్టిన కాన్షిరాం స్ఫూర్తితో ఆయన జయంతి రోజున పార్టీని ఆవిర్భవిస్తున్నామని తెలిపారు. 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో రాష్ట్రాన్ని కేవలం రెండే రెండు వర్గాలు, రెండు సామాజిక కులాలు, మాత్రమే పాలిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పుటలకే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాల కొరకు తాయిలాలు పేరు చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మెజారిటీ ప్రజలకు అధికారంలో వాటాలు వాగ్దానాలకే పరిమితం అని, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అని గొంతెత్తి అరవడమే తప్ప ప్రజాస్వామ్యం అనేది శూన్యమన్నారు. అధికారంలో అట్టడుగు వర్గాలకు, పీడిత, తాడిత కులాలకు మా పార్టీ అధికారంలో వాటా ఇస్తుందని, ఎల్ కె జి నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పిస్తుందని తెలిపారు. దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పాలకులు పట్టించుకున్న దాఖలు లేవని ఆరోపించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి యవతను పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దుతామని, అన్ని వర్గాల కు అవకాశాలను కల్పిస్తామని అన్నారు. మహిళ సాధికారతకు పెద్దపీట వేస్తామని, వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతులతో రైతులను తీసుకునే కోణంలో నడిపిస్తామని తెలిపారు. ప్రజా అధికార పార్టీ వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. నేటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ముందుకు వస్తే ప్రోత్సహిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మా పార్టీ దినదిన ప్రవర్తనంగా ఎదుగుతుందని, రాష్ట్రంలో, దేశంలో, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుందని, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యావత్తు సమాజం కోసం వెనుకబడిన అణగారిన వర్గాల సమాజం కోసం నడుం బిగించి సమాజాన్ని మేల్కొల్పు ఉంటుందని, చైతన్య పరుస్తూ నడిపిస్తుందని అన్నారు. ప్రజా అధికార పార్టీ మాత్రం ప్రజలకు పవర్ రావాలి, ప్రజల చేతిలో అధికారం ఉండాలనే ఉద్దేశంతో ప్రజా అధికార పార్టీని నిర్మించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ముప్పసాని సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లామ్ జై బాబు, రత్న ప్రదీప్, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ జయరాం,.డా. కె.ఎస్.ఎం.వి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News