-డాక్టర్ ఎన్విఎల్ నాగరాజు స్మారక అవార్డును అందుకోనున్న వైఎల్పి
-ముఖ్య అతిధిగా హాజరుకానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తెలుగు భాషా వికాసానికి గత మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేస్తున్న డిల్లీ తెలుగు అకాడమీ, గ్లోబల్ తెలుగు అకాడమీ సంయిక్తంగా యార్లగడ్డకు ఉగాది పురస్కారం ప్రకటించాయి. సంస్ద 35వ వార్షిక సాంస్కృతిక, ఉగాది పురస్కారాల వేడుక డిల్లీలోని గోదావరి ఆడిటోరియిం వేదికగా మార్చి 17వ తేదీన జరగనుండగా, అచార్య యార్లగడ్డకు 2024 సంవత్సరానికి గాను డాక్టర్ ఎన్ వి ఎల్ నాగరాజు స్మారక అవార్డును అందించనున్నారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానుండగా, న్యాయమూర్తులు, పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు పాలుపంచుకోనున్నారు. విశ్వ హిందీ పరిషత్తు జాతీయ అథ్యక్షుని హోదాలో కజకిస్తాన్ పర్యటనలో ఉన్న యార్లగడ్డ శనివారం స్వదేశానికి చేరుకోనున్నారు. తెలుగు, హిందీ భాషా అభివృద్దికి ఇటు దేశంలోనూ. అటు విదేశాలలోనూ అవిరళ కృషి చేస్తున్న లక్ష్మి ప్రసాద్ కు ఈ గౌరవం దక్కటం అభినందనీయమని భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News