Breaking News

చెత్త రహిత నగర నిర్మాణమే లక్ష్యం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-నగర మేయర్ తో కలిసి రూ.15.50 కోట్లతో నిర్మించిన RRR పార్కు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద రూ.15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR (రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్) పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లాతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని.. ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవడానికి సుమారు వెయ్యేళ్ల సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ అయిందని.. ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా RRR(రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్) పేరిట పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. అలాగే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, ఈ – వ్యర్థాలు మరియు ప్రమాదకరమైన వ్యర్థాలను వేరువేరుగా సేకరించవలసిన ఆవశ్యకతను నేటి తరానికి తెలియజెప్పేలా ఎల్.సి.డి. స్క్రిన్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా వీఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. మరోవైపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసాధ్యం అనుకున్న వేల టన్నుల చెత్త తరలింపును ఆచరణలో చేసి చూపినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. దాదాపు 25 వేల టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించినట్లు వివరించారు. అదేవిధంగా రోజుకి 500 టన్నుల చెత్తను గుంటూరు జిందాల్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరుచేస్తూ.. రూ.1 కోటి 29 లక్షల 50 వేల వ్యయంతో ప్రహరీ గోడను సైతం నిర్మించుకున్నట్లు తెలిపారు. 5 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఆకతాయిల చేష్టలకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, పోలీసుల నిరంతర నిఘా ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశానికే ఒక నమూనాగా నిలిచిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే.. ఎక్సెల్ ప్లాంట్ అభివృద్ధి మాత్రం ప్రత్యేకమని తెలిపారు. గత ప్రభుత్వంలో వేలాది టన్నుల చెత్త ఎక్సెల్ ప్లాంట్ లో డంప్ అయ్యేదని.. నిత్యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ధర్నాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజియం, సైన్స్ ఎగ్జిబిషన్, గ్రీనరీ, సోలార్ లైటింగ్ సిస్టం.. ఇలా పార్కును ఒక మోడల్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత ఐదేళ్లలో నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) సత్యవతి, ఈఈ(పార్కులు) ఏఎస్ఎన్ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జూబిన్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *