-రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలి
-ఇంకా విధులో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షాణా చర్యలు
-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు , కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోను, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హార్డింగులను ఇక ఏమాత్రము ఆలస్యం చేయకుండా తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షతమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్ప నుండి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోను మరియు 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని జిల్లాలకు సంబందించి జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు ఇప్పటి వరకూ తమకు అందకపోవడం వల్ల రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ప్రణాళికను సమగ్ర స్థాయిలో రూపొందించలేక పోయామనే విషయాన్ని సంబందిత జిల్లాల ఎన్నికల అధికారులు గుర్తించాలన్నాఠు. ఈ విషయంలో ఇంక ఏమాత్రము ఆలస్యం చేయకుండా నేటి సాయంత్రం లోపు తమ కార్యాలయానికి జిల్లా ఎన్నికల నిర్వహణా ప్రణాళికలను పంపాలని ఆదేశించారు. సి-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై మరియు ఇతర ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులపై తీసుకున్న చర్యలను ఆయన సమీక్షిస్తూ కేసులకు సంబందించి వాస్తవ నివేదికను తమకు వెంటనే అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోమ్ శాఖకు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవో లు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయిన్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె. విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.