-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా పెట్టాలని.. ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాలు అనుసరించాల్సిన విధివిధానాలపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్‌తో కలిసి సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలను మీడియా యూనిట్లు పాటించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా మాధ్యమాలు, మీడియా ప్రతినిధులు అనుసరించాల్సిన విధివిధానాలను వివరిస్తూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. పెయిడ్ న్యూస్ అంశాన్ని ఆయన వివరిస్తూ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించాలన్నారు. జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) పటిష్ట పర్యవేక్షణతో పనిచేయాలన్నారు. నిర్థేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబందిత అభ్యర్థి ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అమమతి ఉందన్నారు. అయితే పెయిడ్ న్యూస్ గా నిర్థారణ అయిన ఆర్టికల్స్ కు సంబంధించి రేటు కార్డు ప్రకారం ఖరారు చేయబడిన సొమ్మును సంబంధిత అభ్యర్థికి అనుమతించి వ్యయం కింద జమచేయడం జరుగుతుందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎఫ్ఎం, కేబుల్‌నెట్‌వర్క్‌లో పెయిడ్ న్యూస్ విషయంలో సంబంధిత ఆర్‌వో నోటీసులు జారీచేస్తారని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అధికారాలు, పరిధిపై కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రింట్ మీడియాలో ప్రకటనలకు ముందస్తుగా ఎంసీఎంసీ నుంచి అనుమతి అవసరం లేదని.. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్, బల్క్ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ యాడ్స్‌కు ఎంసీఎంసీ నుంచి అనుమతి అవసరమని వివరించారు. అనుమతి పొందిన అర్డరు కాపీ నెంబరును కూడా సంబంధిత ప్రకటనపై సూచించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రచార మాధ్యమాలు తప్పనిసరిగా గమనించాలని ఆయన కోరారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రకటనలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా పరిగణిస్తూ చట్టం ప్రకారం తగు చర్యలు చేపట్టడం జరుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
సమావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహనరావు, డివిజనల్ పీఆర్వో కె. రవి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.