– బృంద స్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వర్తించాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటు చేయడం జరిగిందని.. అధికారులు బృంద స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో కలిసి కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం కార్యకలాపాలను పరిశీలించారు. సీ-విజిల్, కాల్‌సెంటర్, ఎన్నికల వ్యయ నిర్వహణ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్), ఎంసీసీ, ఫిర్యాదుల పరిష్కారం, నివేదికల నిర్వహణ తదితర విభాగాల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా నోడల్ అధికారులు, ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ స్క్వాడ్స్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ, స్వీప్ కార్యక్రమాలు తదితరాల మధ్య పటిష్ట సమన్వయ సాధనకు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం కీలకమన్నారు. సీ విజిల్, నేషనల్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టమ్ (ఎన్‌జీఆర్ఎస్), 1950 తదితర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించడం ఎంత ముఖ్యమో సరైన విధంగా నివేదికల్లో పొందుపరిచి ఏరోజుకారోజు సమర్పించడం ముఖ్యమన్నారు. క్షేత్రస్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు అనుసంధానమవుతూ నాణ్యమైన, కచ్చితమైన నివేదికలు రూపొందించాలన్నారు. విధుల నిర్వహణలో వేగంతో పాటు కచ్చితత్వం కూడా ముఖ్యమని కలెక్టర్ డిల్లీరావు స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.