విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని రాజకీయ పార్టీలు 60 శాతం భారత ప్రజల ఆర్థిక రంగమైన సహకార వ్యవస్థను 10 శాతంగా వున్న పెట్టుబడిదారులకు ఆక్రమంగా అప్పగించడానికి కేంద్రం తెచ్చిన చట్టాలను సవరిస్తామని తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని సహకార ధర్మపీఠం విజ్ఞప్తి చేసింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సహకార ధర్మపీఠం ధర్మకర్త సంభారపు భూమయ్య మాట్లాడుతూ దేశంలోని 90 శాతం గ్రామాల్లోని 98 శాతం గ్రామీణ కుటుంబాలకు చెందిన 29 కోట్ల మంది సభ్యులు తమ అవసరాలకు ఖర్చులు తగ్గించుకొని దానిని మూలధనంగా రూ.40,689 కోట్లతో సుమారు 9లక్షల వివిధ రకాలైన సహకార సంఘాలను స్థాపించుకున్నారన్నారు. దానితో వ్యాపారము నిర్వహిస్తూ లక్షల కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించి, ప్రముఖ ఆర్థిక రంగంగా సహకార వ్యవస్థను నిలబెట్టారన్నారు. ఈ సహకార ఆర్థిక రంగం భారత ఆర్థిక రంగంలో 43 శాతం భాగస్వామ్యం కలిగి వుంది. ఈ సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థ భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా వీరు నిర్మించుకున్న సహకార సౌధమని ఆయన వివరించారు. అందరూ బతకాలి అందులో నేనుండాలి అనే మానవీయత 29కోట్ల మంది సభ్యులు ప్రదర్శిస్తున్న వ్యవస్థ ఇది. ఇటువంటి సహకార ఆర్ధిక వ్యవస్థను అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి గత పార్లమెంటు రెండు చట్టాలను తీసుకొచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం-2022లోని సెక్షన్-12(1), బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం-2023లోని సెక్షన్-26 సహకార సంఘాల వాటాలను పెట్టుబడిదారులకు విక్రయించడానికి అవకాశమిస్తున్నాయి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ పార్టీల నేతల దృష్టికి తీసుకొచ్చాము. రాష్ట్రంలోని ప్రముఖ ఆర్థికవేత్తల దృష్టికి కూడా తీసుకెళ్లాము. వారు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక జాయింట్ స్టేట్ మెంట్ కూడా జారీచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలలో ఈ రెండు చట్టాలను సవరించడానికి, సహకార స్టాక్ ఎక్స్చేంజ్ అనే భావనను ఆమోదించబోమని హామీ ఇవ్వాలని సహకార ధర్మపీఠం విజ్ఞప్తి చేస్తోందన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నుంచి సభ్యులు సంతకాలు చేసిన ఒక వినతిపత్రాన్ని సహకార సంస్థలను పరిరక్షించండి అనే నినాదంతో నూతన పార్లమెంట్ సభ్యులకు ప్రజల ఆకాంక్షగా తెలియజేయాలని సంకల్పించినట్లు ఆయన వివరించారు. అనంతరం విజయవాడలో ధర్మకర్త సంభారపు భూమయ్య, వైసిపి అధికార ప్రతినిధి అంకం నారాయణ మూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావులతో పాటు పలు పార్టీల నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో సహకార భూమి జర్నల్ సహకార సంఘం చైర్మన్ దాసరి కేశవులు, డైరెక్టర్ చావా రవి, వ్యవస్థాపక సభ్యుడు కృష్ణ కానూరి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …