రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీల కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇతర న్యాయ సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఆ సమస్యలను పరిష్కరించు కోవాలని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందక పోయినా ఈ సంస్థ సహకారంతో సమస్యలు పరిష్కరించుకోగలరని వివరించారు. ఆర్ధిక సమస్యల కారణంగా పిల్లల విద్యాభ్యాసం ఆగిపోవడం, సమాజంలో ఖైదీల కుటుంబ సభ్యుల పట్ల వారి పిల్లల పట్ల వివక్ష చూపడం లాంటి ఇబ్బందులు ఎవరికైనా ఎదురయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని, తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు.
స్థానిక ఓ.ఎన్.జి.సి లోని గోదావరి గోల్ఫ్ క్లబ్ నందు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయముర్తి కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వివిధ మహిళా చట్టాల పై అవగాహన కల్పించారు. మహిళల పై జరిగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొని వారి హక్కులను పరిరక్షించుకోగల సామర్ధ్యం పెంచుకోవాలని, ఇబ్బందులకు భయపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని వివరించారు.