Breaking News

ఎన్నికల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు

– స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌మాండ్ కంట్రోల్ రూం
– ఫిర్యాదుల‌కు నాణ్య‌మైన ప‌రిష్కారం
– ఇంకా ఎవ‌రైనా ఉంటే వెంట‌నే ఓటు న‌మోదుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఈ నెల 16న సాధార‌ణ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌క‌డ్బందీగా అమ‌లుచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు స్ప‌ష్టం చేశారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వీసీ హాల్‌లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్లు త‌దిత‌రాల‌పై క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. రాజకీయ పార్టీలు, పోటీచేయ‌నున్న అభ్య‌ర్థులు త‌దిత‌రులు నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. ఎంసీసీ అమ‌లుకు సంబంధించి 30 మంది ప్ర‌త్యేక అధికారుల బృందాలు ప‌నిచేస్తున్నాయ‌న్నారు. 42 ఫ్ల‌యింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ప‌బ్లిక్ స్థ‌లాలు, ప్రైవేటు స్థ‌లాల్లో స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి అనాథ‌రైజ్డ్ బ్యాన‌ర్లు, పోస్ట‌ర్లు, వాల్ రైటింగ్ త‌దిత‌రాల‌ను తొల‌గించ‌డం, వైట్ వాష్ చేయ‌డం, ముసుగులు వేయ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివ‌రించారు. ఎంసీసీ అమ‌లు విష‌యంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలుకు స్ప‌ష్ట‌మైన మార్గ‌నిర్దేశ‌నం చేయడం జ‌రిగింద‌న్నారు. ఎంసీసీ ఉల్లంఘ‌న‌లకు సంబంధించి ఐపీసీ సెక్ష‌న్ 188, 171హెచ్‌, 1951 ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం త‌దిత‌రాల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు స్ప‌ష్టం చేశారు.

స్వ‌చ్ఛంగా ఓట‌ర్ల జాబితా:
స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో స్వ‌చ్ఛ‌మైన ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న జ‌రిగింద‌ని.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఈ నెల 16వ తేదీవ‌ర‌కు వ‌చ్చిన తొల‌గింపు, క‌రెక్ష‌న్స్‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 26వ తేదీలోపు ప‌రిష్క‌రించేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు. అదే విధంగా ఏప్రిల్ 18న నోటిఫికేష‌న్ విడుద‌ల కానున్నందున అప్ప‌టి వ‌ర‌కు చేర్పులు, బ‌దిలీల‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించ‌నున్నట్లు తెలిపారు. అర్హులెవ‌రైనా ఉంటే వెంట‌నే ఓటు న‌మోదుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది మార్చి 16 నాటికి జిల్లాలో 16,83,000 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని.. వీరిలో 37,760 మంది యువ ఓట‌ర్లు ఉన్న‌ట్లు తెలిపారు. 85 ప్ల‌స్ ఓట‌ర్లు 8,519 మంది, 14,838 మంది పీడ‌బ్ల్యూడీ ఓట‌ర్లు ఉన్న‌ట్లు వివ‌రించారు. ఈపీ రేషియో 710, జెండ‌ర్ రేషియో 1,049గా ఉంద‌న్నారు. రెవెన్యూ, పోలీస్‌, ఎక్సైజ్ త‌దిత‌ర విభాగాల‌తో 0866-2570051తో క‌లెక్ట‌రేట్‌లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ప‌నిచేస్తోంద‌ని.. అదే విధంగా 9154970454 వాట్స‌ప్ నంబ‌రు కూడా అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు.
కంట్రోల్ రూం, 1950 కాల్ సెంట‌ర్‌, ఎన్‌జీఎస్‌పీ, సీవిజిల్ త‌దిత‌రాల‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌ను నాణ్యంగా ప‌రిశీలించ‌నున్న‌ట్లు తెలిపారు. ఎల‌క్ట్రానిక్ మీడియా, సోష‌ల్ మీడియా, కేబుల్ నెట్‌వ‌ర్క్ త‌దిత‌రాల్లో ప్ర‌క‌ట‌న‌ల‌కు మీడియా స‌ర్టిఫికేష‌న్ అండ్ మానిట‌రింగ్ క‌మిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమ‌తి అవ‌స‌ర‌మ‌ని వివ‌రించారు. ప్రింట్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌ల‌కు ముంద‌స్తు అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని.. అయితే ఎన్నిక‌ల వ్య‌య వివ‌రాల న‌మోదుకు ఎంసీఎంసీకి వివ‌రాలు అంద‌జేయాల్సి ఉంటుంద‌న్నారు. ఎన్నిక‌ల‌ను ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో నిర్వ‌హించ‌డంలో మీడియా పాత్ర కీల‌క‌మ‌ని పేర్కొంటూ పెయిడ్ న్యూస్‌పై గ‌ట్టి ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

రూ. 10 కోట్లకు పైగా విలువైన సీజ‌ర్లు: సీపీ కాంతిరాణా టాటా
జిల్లాలో నిష్ప‌క్ష‌పాత‌, శాంతియుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు పోలీసు శాఖ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని సీపీ కాంతిరాణా టాటా అన్నారు. పోలీసు శాఖ ద్వార 2023, డిసెంబ‌ర్ 26 నుంచి 2024, మార్చి 18 వ‌ర‌కు 35,992 లీట‌ర్ల మ‌ద్యం, 165.76 కిలోల గంజాయి, 33.97 కిలోల విలువైన లోహాలు, రూ. 4.19 కోట్ల న‌గ‌దు త‌దిత‌రాల‌ను సీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని.. 2023, మార్చి 16 ఉంచి ఈ ఏడాది మార్చి 18 వ‌ర‌కు సెబ్ ద్వారా 37,841 లీట‌ర్ల మ‌ద్యం, 5.5 కిలోల గంజాయిని సీజ్ చేయ‌డం జ‌రిగింద‌ని.. సీజ్ చేసిన న‌గ‌దు, మ‌ద్యం, విలువైన లోహాలు త‌దిత‌రాల విలువ రాష్ట్రంలోనే అత్య‌ధికంగా రూ. 10 కోట్లకు పైనే ఉంద‌ని వివ‌రించారు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 443 ఆర్మ్స్‌కు గాను 361 డిపాజిట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,215 బైండోవ‌ర్ కేసులు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. 12 అంత‌ర్రాష్ట్ర బోర్డర్ చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయ‌ని.. అదేవిధంగా గూడ‌వ‌ల్లి, ఇబ్రంహీంప‌ట్నం, వార‌ధి త‌దిత‌ర చోట్ల కూడా చెక్‌పోస్టులు ఏర్పాటుచేయ‌డం జ‌రిగింద‌న్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌ను సంద‌ర్శించ‌డం జ‌రిగింద‌ని..ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. నాలుగు సీఆర్‌పీఎఫ్ బృందాలు ఇప్ప‌టికే వ‌చ్చాయ‌ని.. మ‌రో బృందం రానుంద‌ని.. ఒక్కో బృందంలో 70-80 మంది ఉంటార‌ని వివ‌రించారు. రాత్రి స‌మ‌యాల్లోనూ త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు సీపీ కాంతిరాణా టాటా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *