–ఏప్రిల్ 18 నుండి (సి20), మే2 నుండి (సి23), పాలిటెక్నిక్ పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలిటెక్నిక్ (సి20) 4, 5 సెమిస్టర్ ల సాధారణ పరీక్షలు ఏప్రిల్ 18 నుండి ప్రారంభం కానున్నాయని సాంకేతిక విద్య శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ సంస్ధ ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ను అనుసరించి సి20, సి-16/ఇఆర్-91/ఇఆర్-20 స్కీమ్‌లకు సంబంధించిన అన్ని సప్లిమెంటరీ పరీక్షలు సైతం అదే తేదీన ప్రారంభం అవుతాయన్నారు. అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించడానికి మార్చి 26 ఆఖరు తేదిగా ఉందన్నారు. సి23 ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే 2 వతేదీ నుండి ప్రారంభమవుతాయని నాగరాణి తెలిపారు. సి23 ఫస్ట్ ఇయర్ పరీక్షల నోటిఫికేషన్ సైతం బుధవారం విడుదల చేయనున్నామన్నారు. ముందుగా ప్రకటించిన విధంగానే పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నామని ప్రకటించారు. పరీక్షలకు సంభందించిన పూర్తి సమాచారం కోసం https://apsbtet.ap.gov.in/, https://sbtet.ap.gov.in/ వెబ్ సైట్ల ను సందర్శించ వలసి ఉందన్నారు.