-స్థానిక ఎన్నికల్లోనే సత్తా చాటారు… సార్వత్రిక ఎన్నికల్లోనో అదే స్ఫూర్తి కొనసాగించాలి
-పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
-గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించిన పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు… అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాటిని తట్టుకొని పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అంతా ఒక మాట మీద నిలబడి స్థానిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలసి సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగించాలి. పి.గన్నవరం నియోజకవర్గం కచ్చితంగా జనసేనదే. గెలుపూ మనదే’ అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “పి.గన్నవరం నియోజకవర్గానికి స్థానిక ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి ఇంఛార్జ్ లేకపోయినా అక్కడి పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులు ఒకే తాటి మీద నిలిచారు. పార్టీ విధివిధానాలను అనుసరించారు. ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఈ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దిశదశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే” అన్నారు.
ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు, ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, నియోజవర్గం ముఖ్య నాయకులు, ఎంపీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.