విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టు ల సమస్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే ) ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ విజ్ఞప్తి చేశారు. యువకిశోరం షాహిద్ భగత్ సింగ్ అమరత్వం పొందిన రోజును జర్నలిస్ట్ ల కోర్కెల దినంగా పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) యిచ్చిన పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కోర్కెల దినం నిర్వహించడం జరిగింది.విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదుట జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోర్కెలను ను అమలు చేయాలని నినదించారు. కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రతకు. ప్రత్యేక చట్టం చేయాలని, నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చందు జనార్ధన్ మాట్లాడుతూ శనివారం ఏ.పీ.యూ.డబ్ల్యూ.జే ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో శాసనసభ్యులకు వివిధ రాజకీయ పార్టీలు తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. విజయవాడలో జిల్లా రెవెన్యూ అధికారి (డిఆరోవో)శ్రీ.వి.శ్రీనివాసరావుకు జనార్ధన్ నాయకత్వంలో జర్నలిస్టుల బృందం వినతిపత్రం సమర్పించారు, వినతి పత్రం సమర్పించిన వారిలో ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కంచెల జయరాజ్ , ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్.కే బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, పి.సురేంద్ర కుమార్ తదితరులు వున్నారు .
ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ చిత్రపటానికి చందు జనార్ధన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఎదుట జరిగిన కార్యక్రమంలో పైన పేర్కొన్న ఏపీయూడబ్ల్యూజే నాయకులతో పాటు సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి.రామారావు, ఎం.మురళీకృష్ణ, ఎన్.సాంబశివరావు, పి.రత్నాకర్ రావు , సయ్యద్ హుస్సేన్ , జీవన్ కుమార్ , టీ.వీ ప్రసాద్, ఎం.వి సుబ్బారావు, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.