-మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు
-ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం
-సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి
-15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి
-మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి
-ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి
-తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్రంలో మంచినీటి సరఫరా,ఉపాధి హామీ పనులపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్ల తో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.ఇప్పటికే 15 ఆర్థిక సంఘం నిధులు 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో వివిధ తాగునీటి పధకాలను నిర్వహణ,నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకులు ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.
15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భజల మట్టాల స్థాయిని మానిటర్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.వివిధ బోరు బావుల పరిస్థితిని కూడా నిరంతరం మానిటర్ చేయాలని అన్నారు.అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. తాగునీటి అవసరాలకు కాలువలు ద్వారా చెరువులు నింపేందుకు విడుదల చేసే నీరు శివారు ప్రాంతాలకు సక్రమంగా చేరేలా చూడాలని కలెక్టర్లను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
రానున్న మూడు మాసాలు రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా తగిన పనులు కల్పించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీలైనంత వరకు కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించి కుటుంబానికి 100 రోజుల పని దినాల కల్పన లక్ష్యాన్ని అధిక మించాలని సిఎస్ స్పష్టం చేశారు.ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఉ.5.30.గం.ల నుండి ఉ.10.30 గం.ల వరకు నిర్వహించేలా చూడాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా,ఉపాధి పనుల పనులు విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర జల వనరులు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్,గ్రామ పంచాయతీలకు మొత్తం 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.నీటి లభ్యతకు సంబంధించి మంచినీటి పధకం,సోర్సులు వారీగా మ్యాపింగ్ చేయడం జరుగుతోందని చెప్పారు.అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో సమ్మర్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జలవనరులు, పిఆర్ అండ్ ఆర్డి,మున్సిపల్ పరిపాలన శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తాగు నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు.
తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న నీటిని ఇతర అవసరాలకు వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఈసమావేశంలో పిఆర్ అండ్ ఆర్డి శాఖ కమీషనర్ కె.కన్నబాబు వర్చువల్ గా పాల్గొన్నారు.ఇంకా ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి, ఆర్డబ్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి, గ్రౌండ్ వాటర్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.