మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల అధికారులకు తమ సహకారాన్ని అందించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో కోరారు. సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, పార్టీల ప్రతినిధులు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్, ఎన్నికల ప్రచారం కోసం వాహనాల వినియోగం అనుమతుల కోసం సువిధ ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా ఆఫ్ లైన్ పద్ధతిలో ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వారి నుండి ఈ క్రింది పేర్కొన్న అంశాలలో అనుమతులు పొందవచ్చని తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ జిల్లా స్థాయి ఆఫీస్ బేరర్ కోసం
హెలికాప్టర్ మరియు హెలిప్యాడ్ కోసం, వీడియో వ్యాన్ (DEO స్థాయి) అనుమతి కోసం, ఎయిర్ బెలూన్ ల కోసం, వాహన అనుమతి కోసం (ఇంట్రా డిస్ట్రిక్ట్), దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
సంబంధిత పార్లమెంటు లేదా శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నుండి క్రింద తెలిపిన అనుమతులు పొందవచ్చన్నారు.
లౌడ్ స్పీకర్లతో రాజకీయ ప్రచార సమావేశాలు ఏర్పాటు చేయుటకు, తాత్కాలికంగా రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రారంభించేందుకు, వాహనాల అనుమతులు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, వీధి మూలల్లో సమావేశాలు, లౌడ్ స్పీకర్లు లేకుండా సమావేశాలు, ఇంటింటి ప్రచారము, పోటీ చేస్తున్న అభ్యర్థిగాని అతని ఎన్నికల ఏజెంట్ గాని పార్లమెంటు/ శాసనసభ మొత్తం పరిధిలో వాహనాల అనుమతులు, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వాహన అనుమతుల కోసం లోడ్ స్పీకర్ల అనుమతి, వాహనంతో పాటు లౌడ్ స్పీకర్లు, కరపత్రాల పంపిణీ, బ్యానర్లు జెండాల ప్రదర్శన, ర్యాలీ, గోడపత్రాలు, హోర్డింగులు, యూనిపోల్ ప్రదర్శనలు, పార్టీ లేదా పార్టీ కార్యకర్తకు శాసనసభ సెగ్మెంట్కు ఒక వాహనం చొప్పున అనుమతులు పొందడం కోసం దరఖాస్తులను సంబంధిత పార్లమెంటు లేదా శాసనసభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల నుండి దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందవచ్చన్నారు.
పార్టీ లేదా పార్టీ కార్యకర్త శాసనసభ సెగ్మెంట్ కోసం ఒక్కో వాహనం చొప్పున అనుమతి కోసం పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఒక జిల్లాకు మించి అంతర్ జిల్లా ర్యాలీ లేదా ఊరేగింపు కోసం సంబంధిత అభ్యర్థిగాని రాజకీయ పార్టీ కానీ సింగల్ విండో పద్ధతి కౌంటర్ ద్వారా ఆయా జిల్లాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ విధానము రిటర్నింగ్ అధికారుల స్థాయిలో ప్రతిచోట అందుబాటులో ఉంటుందన్నారు.
రాష్ట్ర/ కేంద్ర రాజకీయ పార్టీలు గాని అభ్యర్థులు గాని వారు ఎన్నికల సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించేందుకు 48 గంటల ముందు సంబంధిత ఎన్నికల అధికారుల నుండి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు.
ప్రజా ప్రతినిధ్య చట్టం చట్టం 1951 లోని సెక్షన్ 126, 126 ఏ, 135 సి ప్రకారం వచ్చే మే నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయం నుండి 48 గంటల ముందు నుండి ఎటువంటి ఎన్నికల ప్రచారం గాని కార్యక్రమాలు గాని లేకుండా నిశ్శబ్ద కాలాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు.
ఆ సమయంలో ప్రజలు గాని జర్నలిస్టులు గానీ రాజకీయ నాయకులతో సహా ఎవ్వరు కూడా రాజకీయ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు
పోలింగ్ జరిగే రోజున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి తన సొంతానికి వాడుకునేందుకు ఒక వాహనము, తన ఎన్నికల ఏజెంట్ కు ఇంకొక వాహనము,, తన ఎన్నికల ఏజెంట్ కు గాని కార్యకర్తకు గానీ పార్టీ కార్యకర్తకు గానీ ఒక్కో శాసనసభ నియోజకవర్గం సెగ్మెంట్లో ఒక్కో వాహనం వినియోగించుకునేందుకు అనుమతి పొందవచ్చన్నారు.
రాష్ట్ర శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ రోజున పోటీ చేస్తున్న అభ్యర్థికి సొంతానికి వాడుకునేందుకు ఒక వాహనానికి, తన ఎన్నికల ఏజెంటు వినియోగించడానిక ఒక వాహనానికి, తన రాజకీయ పార్టీ కార్యకర్తల కోసం ఒక వాహనం వినియోగించుకోవడానికి అనుమతి ఉంటుందన్నారు.
ఈ వాహనాలలో కారును గాని, టాక్సీలు గాని, ఆటో రిక్షాలు గాని, రిక్షాలు గాని, ద్విచక్ర వాహనాలు కానీ అనుమతించడం జరుగుతుందని, వీటిలో డ్రైవర్తో కలుపుకొని 5 మందికి మించకుండా తిరగడానికి అనుమతి ఉంటుందన్నారు.
అభ్యర్థులు సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్ అధికారి నుండి అనుమతులు పొందవలసి ఉంటుందన్నారు. ఇందుకోసం వారు వినియోగించే వాహనాల వివరాలను అందజేయవలసి ఉంటుందన్నారు. వారికి జారీ చేసిన అనుమతుల పత్రాలను వాహనాల అద్దాలపై కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు.
Prajavartha Online Telugu News