గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్ధులు ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు చేయాలంటే తప్పనిసరిగా 48 గంటల ముందే దరఖాస్తు చేసి, అనుమతి పొందాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ ప్రచార ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టడానికి 48 గంటల ముందే రిటర్నింగ్ అధికారి నుండి తగిన అనుమతులు పొందాలని, అందుకు తగిన విధంగా జిఎంసి ప్రధాన కార్యాలయంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు వేరువేరుగా సింగిల్ విండో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, బోర్డ్ లు, బ్యానర్లు, తాత్కాలిక పార్టీ కార్యాలయాల ప్రారంభం తదితర అంశాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి నుండి అనుమతి పొందాలన్నారు. అలాగే అభ్యర్ధులు ప్రచురించే కరపత్రాలను ముందుగా జిల్లా ఎన్నికల అధికారి అనుమతితో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటి సర్టిఫై చేసిన తదుపరి మాత్రమే పంపిణీ చేసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఏ విధమైన రాజకీయ పార్టీల ప్రచారాలు చేయడానికి వీలులేదని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న కమర్షియల్ స్థలాల్లో కూడా రాజకీయ పార్టీల ప్రచార బోర్డ్ లు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికి వీలు లేదని ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించాలని సూచించారు. నగరంలోని ప్రైవేట్ హోర్డింగ్స్, బోర్డ్ లను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమాన ప్రాతిపదికగా కేటాయించడానికి సిటి ప్లానర్ ప్రతిపాదనలు సిద్దం చేయాలని, తదుపరి జిల్లా ఎన్నికల అధికారి అనుమతి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీలకు కేటాయింపులు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఆర్ఓలు ప్రదీప్ కుమార్, వెంకట లక్ష్మీ, సునీల్, మేనేజర్ ప్రసాద్, సూపరిండెంట్ పద్మ, రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపి నుండి డి.జాని బాబు, టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్, కాంగ్రెస్ నుండి జాని భాష, సిపిఎం నుండి ఖాసిం షాహిద్, ఎంసిసి, ఎక్స్పెండీచర్ టీం లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …