
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఎన్నికలలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడే వారినే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం అవసరమని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని పురస్కరించుకొని ప్రతి నెలా 30వ తేదీన గాంధీ నాగరాజన్ కళ్ళకు గంతలతో నిరాహార దీక్ష చేస్తూ వస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం భవానిపురం ఊర్మిళ నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో గాంధీ నాగరాజన్ కళ్ళకు గంతలతో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మతతత్వం అనేది అత్యంత ప్రమాదకరమైనదని, మతంకన్నా మతసామరస్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యక్తికి, వ్యక్తిత్వానికి విలువనిస్తూ తగిన వ్యక్తులను ప్రజా ప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకోవడం ముఖ్యమని ఆయన చెప్పారు. మతతత్వం అత్యంత ప్రమాదకరమని, మతతత్వ శక్తులు అధికారంలోకి వస్తే ఎన్నికల నియమావళి ఉంటుందా లేక ఎన్నికల నివాళినా అనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు. దేశంలో మహిళలకి సంపూర్ణ రక్షణ, స్వేచ్ఛ లభించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News