-ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఏర్పాటు
-24 గంటలలో వివరణాత్మక నివేదికకు ఆదేశించిన కమీషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ జిల్లా కొమ్మాది చైతన్య పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని బలవన్మణంపై సాంకేతిక విద్యా శాఖ విచారణకు అదేశించింది. సంఘటన పూర్వాపరాలపై పూర్తిస్దాయి విచారణ జరిపి 24 గంటలలోపు వివరణాత్మక నివేదిక అందించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శనివారం ఉత్తర్వులు జారీ చేసారు. వివిధ దినపత్రికలలో శుక్రవారం వచ్చిన వార్తా కథనాలను పరిశీలించిన మీదట వాస్తవాలను వెలికితీసే క్రమంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణ కమిటీగా నియమిస్తున్నామన్నారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. చంద్ర శేఖర్ నేతృత్వంలో విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ మెటలర్జీ విభాగం అధిపతి డాక్టర్ కె. రత్న కుమార్, సివిల్ ఇంజినీర్‌లో లెక్చరర్ డాక్టర్ కె. రాజ్య లక్ష్మి సభ్యులుగా ఈ బృందం పనిచేయనుందని కమీషనర్ తెలిపారు. విద్యాసంస్ధలోని ఒక అధ్యాపకుని లైగింక వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నానని తండ్రికి ఆ విధ్యార్దిని వాట్సప్ సమాచారం పంపినట్టు పత్రికలలో కధనాలు వెలువడ్డాయి. మరోవైపు తాను మాత్రమే కాకుండా కళాశాలలో పలువురు విద్యార్దినులు ఇలాగే ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని సమాజానికి తెలియచేయలన్న ఆలోచనతోనే తాను చనిపోతున్నానని ఆ వాట్సప్ సందేశంలో పేర్కొంది. దీంతో అప్రమత్తమైన సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ నాగరాణి పూర్తి విచారణ కోసం బృందాన్ని నియమిస్తూ తగిన చర్యల కోసం వెంటనే నివేదిక సమర్పించాలని స్పష్టం చేసారు.