-ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులే…ఈ నెల 14 లోగా ధరఖాస్తు చేయాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో నోటిపికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది. మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకొనే సువర్ణావకాశం ఇది. ఈ మహాక్రతువులో మనం కూడా భాగస్వాములు కావాలంటే, కేవలం ఓటు హక్కును కలిగి ఉంటే చాలు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. అత్యంత విలువైన, అమూల్యమైన ఓటుహక్కును పొందడానికి ఇప్పటికీ అవకాశాన్ని కల్పిస్తోంది మన ఎన్నికల కమిషన్.
ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా ఓటరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులే. దేశంలో 18 సంవత్సరాలు దాటిన భారత పౌరులందరికీ ఓటుహక్కు కల్పిస్తోందీ మన రాజ్యాంగం. దీనికి దరఖాస్తు సమర్పించడం ఒక్కటే పౌరులు చేయాల్సిన పని. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండినవారందరికీ ఓటు హక్కు పొందే అవకాశాన్ని కల్పించారు. వీరంతా ఈ నెల 14వ తేదీలోపల ధరఖాస్తు చేసుకోగలిగితే, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత ధరఖాస్తు చేసినా, ఈ ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం మాత్రం ఉండదు. కొత్త ఓటు కోసం ఈ నెల 14వ తేదీ లోపల వచ్చే ధరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. వాటిని పదిరోజుల్లోగా పరిశీలించి, అర్హత ఉంటే ఓటర్ల జాబితాలో చేరుస్తారు. వీరికి మే 13న జరిగే ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 14 తరువాత వచ్చే దరఖాస్తులను మాత్రం ఎన్నికల తరువాత మాత్రమే పరిశీలిస్తారు. వాస్తవానికి నామినేషన్లను దాఖలు చేసే వరకు ఓటు నమోదుకు ధరఖాస్తు చేసే అవకాశం ఉంది. అయితే వచ్చిన వాటిని పరిశీలించి, జాబితాల్లో చేర్చడానికి పదిరోజుల సమయం పడుతుంది కాబట్టి, ధరఖాస్తు చేయడానికి చివరితేదీ ఏప్రిల్ 14గా నిర్ణయించారు.
ఎలా ధరఖాస్తు చేయాలి ?
18 ఏళ్లు నిండినవారు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, http://voters.eci.gov.in ద్వారా, బి ఎల్వో ద్వారా ఫారమ్ 6లో దరఖాస్తు చేయాలి. వచ్చిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిశీలన పూర్తిచేసి, నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా ఓటుహక్కు పొందినవారి పేర్లును అనుబంధ జాబితా ద్వారా, అలాగే చనిపోయినవారు, ఆబ్‌సెంటీస్, బదిలీ ఓటర్ల వివరాలను ఏఎస్‌డి జాబితాలో నమోదు చేసి, ఆయా పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే ఓటు కోసం దరఖాస్తు చేసి, ఓటుహక్కు పొందిన వారికి ఓటరు గుర్తింపు కార్డులను పంపించడం జరిగింది.
ఇదే చివరి అవకాశం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
కొత్తగా ఓటుహక్కు పొందడానికి, అర్హత ఉన్నవారంతా ఈ నెల 14వ తేదీలోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వీరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఓటువేసే అవకాశం లభిస్తుంది. ఓటు వజ్రాయుధం లాంటిది. అర్హత ఉన్నవారంతా ఓటు హక్కు పొందడమే కాకుండా, ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి.