-ఉపాధిహామీ పని ప్రదేశాల్లో తగిన నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఫించన్లు పంపిణీ,వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు,తాగునీరు, ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులు తద్దితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.
ముందుగా రాష్ట్రంలో ఫించన్ల పంపిణీకి సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుండి పింఛన్ల పంపిణీపై సవరించిన మార్గదర్శక ఆదేశాలను జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.ఎండ వేడిమి,వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో ముఖ్యంగా Do’s Dont’s పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వేసవి దృష్ట్యా మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, బోర్లు ఫ్లషింగ్, మరమ్మత్తులు చేపట్టాలని, ఉపాధిహామీ పనులను ఉదయం సమయంలో చేపట్టేలా ఉండాలని, పని ప్రదేశాల్లో తగిన నీడ, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి, డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ , డి ఆర్ డి ఎ ఎ పి డి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.