రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యి వడగాల్పులు వీచే అవకాశమున్నదని జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా, తూర్పు గోదావరి జిల్లా కలక్టరు డాక్టర్ ఎం .మాధవీలత వారీ ఆదేశాల మేరకు వివిధ పరిశ్రమలు మరియు పని ప్రదేశాలలో పనిచేసే పనివారిని ఎండలు మరియు వడగాల్పులనుండి రక్షించడానికి సంబంధిత పరిశ్రమల యజమానులు తీసుకోవలసిన చర్యలను మరియు అవసరమైన సూచనలను చెయ్యడం జరిగిందనీ సహాయ కార్మిక కమీషనర్ బి ఎస్ ఎమ్ వలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు, ఎండల తీవ్రత పరిస్థితుల దృష్ట్యా, తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని పరిశ్రమలు, సంస్థలు, కర్మాగారాలు, వర్కుషాపులు నిర్మాణ సంస్థల మేనేజ్ మెంట్లు, యజమానులు, ఎండలు మరియు వడగాల్పుల యొక్క ప్రతికూల ప్రభావము కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు మరియు ఉద్యోగులపై తగ్గించడానికి మరియు వారి భద్రత, రక్షణ కొరకు తీసుకోవాలని చర్యలు పై సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా – కష్టతరమైన పనులుచేసే కార్మికులు, పనివారికి పని వేళలను రీషెడ్యూల్ చేయాలి, అనగా వేడిగా ఉండే మధ్యాహ్నం వేళల్లో (మ.12-00 నుంచీ సాయంత్రం 4 వరకు) కార్మికులను పనికి దూరంగా ఉంచి, రోజులోని వేడి తక్కువగా వుండే సమయంలో కార్మికులు పనిచేసేలా పనిగంటలను మార్పు చేయాలి.
పని ప్రదేశాలలో కార్మికులందరికీ తగినంత పరిమాణంలో చల్లని/సురక్షితమైన తాగునీరు, అత్యవసర ఐస్ ప్యాక్లు మరియు వేడి అనారోగ్య నివారణ సామగ్రిని పనిప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలి.
పని ప్రదేశాలలో షెల్టర్లు/శీతలీకరణ ప్రాంతాలు, అత్యవసర ఔషధాలైన ఓ ఆర్ ఏస్, ఐవి ద్రవాలు మొదలైన వాటిని అందించడం ఆరోగ్య పరిరక్షణపై కోసం ఏర్పాట్లు చేయాలి.
అధిక వేడి-వడగాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల గురించి, నివారణ చర్యల గురించి కార్మికులకు తగిన అవగాహన కల్పించాలి.