– పోలింగ్ సిబ్బందికి దశల వారీగా శిక్షణకు ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వివరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి తదితరులతో కలిసి హాజరయ్యారు. అర్హులైన వారికి పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు సంబంధించి జిల్లాస్థాయిలో సన్నద్ధత, ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు ఎన్నికల నిర్వహణలో భాగమైన పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్; ఈవీఎం, వీవీప్యాట్ ర్యాండమైజేషన్ తదితరాలతో పాటు పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో తేదీల వారీగా నిర్వహించనున్న కార్యకలాపాలను వివరించారు. ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను తెలిపారు. పీవోలో, ఏపీవోలు తదితరులతో పాటు ఇతర పోలింగ్ సిబ్బందికి ప్రణాళిక ప్రకారం శిక్షణ ఇవ్వనున్నామని.. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు.
జిల్లాలో రూ. 5.27 కోట్ల విలువైన సీజర్లు:
ఏప్రిల్ 1 నాటికి జిల్లాలో రూ. 1.87 కోట్ల నగదుతో సహా రూ. 86.89 లక్షల విలువైన మద్యం, రూ. 5.58 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 2.32 కోట్ల విలువ చేసే విలువైన లోహాలు తదితరాలతో కలిపి మొత్తం రూ. 5.27 కోట్ల విలువైన సీజర్లు జరిగినట్లు కలెక్టర్ డిల్లీరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్)ను పటిష్టంగా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు.