-ప్రతి వారం 5 లక్షల పని దినాలను కల్పించేందుకు ప్రణాళిక..
-వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామి పథకం ద్వారా పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని, 82లక్షల పని దినాలను కల్పించాలనే లక్ష్యం కాగా ప్రతి వారం 5 లక్షల పని దినాలను కల్పించేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డికి వివరించారు.
ఉపాధి హామి, త్రాగునీటి సరఫరా, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్ జవహర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లాలో పని కోరిన ప్రతి కూలీకి ఉ పాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారానికి 5 లక్షల పని దినాలు కల్పించే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామి ద్వారా చెరువులు పూడిక తీత, డొంక రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి, మొక్కలు నాటడం వంటి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని కూలీలకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధింత అధికారులను ఆదేశించారు, ఇందులో భాగంగా వేకువ జామునే పనులు మొదలు పెట్టి ఉదయం 10 గంటల వరకు మాత్రమే పనులు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పనులు జరిగే ప్రాంతాలలో కూలీలకు గ్రీన్ షేడ్స్, తాటీ, ఈత ఆకులతో తాత్కాలిక పందిళ్ళు వేసేలా చర్యలు తీసుకున్నామని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉ ంచుతున్నామని, గ్రామ పంచాయతీ సహకారంతో చల్లటి త్రాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజ్లో ప్రస్తుతం 3 టియంసిల నీటి నిల్వలు ఉన్నాయని 1.5 టియంసిల వరకు త్రాగు నీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేలా చర్యలు తీసుకున్నామన్నారు. మెట్ట ప్రాంతాలలో బోర్ వెల్స్ పరిశీలించి, మరమ్మతులు అవసరమైన వాటికి మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వడగాల్పులు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు వేడిగాల్పులకు గురి కాకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. స్వచ్చంద సంస్థల సహకారంతో త్రాగునీటి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ ఆధ్వర్యంలో త్రాగునీటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించిన్నట్లు తెలిపారు. జిల్లాలో పెన్షన్ దారులకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈనెల 3వ తేది నుండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి పెన్షన్ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుటుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్లో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డ్వామా పిడి జె. సునీత, డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ డి వెంకటరమణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.