-జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు
నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు దేవస్థానం, సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉగాది మహోత్సవాలపై జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఎలాంటి చిన్న సంఘటనలకు తావివ్వకుండా… శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కర్ణాటక నుండి వచ్చే కన్నడ భక్తులు వదెబ్బకు గురి కాకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఎంట్రీ పాయింట్ నుండి శ్రీశైలం చేరే వరకు అవసరమైన అన్ని ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డియంహెచ్ఓను ఆదేశించారు. వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు వచ్చే పాదయాత్ర భక్తులకు అటవీ మార్గంలో గుర్తించిన మార్గమద్యములో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. అలాగే వృద్ధులు, పిల్లలు, పాదయాత్రలో ఇబ్బందులు పడకుండా సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు. ఎక్కడ చెత్తా చెదారం వుండకుండా పారిశుద్ధ్య పనులను 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని డీపిఓను ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం,పార్కింగ్ ప్రదేశాలు, భక్తుల దర్శన క్యూలైన్లు, లడ్డు ప్రసాద కౌంటర్లు తదితరాలపై దృష్టి సారించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ హటకేశ్వరం వద్ద వున్న దుకాణాలను వెనక్కి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని డిఎఫ్ఓను సూచించారు. భక్తులు క్యూలైన్లలో దూసుకోకుండా మెస్ ఎత్తును పెంచాలని దేవస్థానం ఈవోను ఎస్పీ సూచించారు. అలాగే క్యూలైన్లలో అధిక సంఖ్యలో సేవకులను ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైనంత నీరు, మజ్జిగ సరఫరా చేయించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్రాగునీటి కోసం దేవస్థాన పరిధిలో ఏర్పాటుచేసిన సింటెక్స్ ట్యాంకులలో భక్తులు స్నానాలు చేయకుండా త్రాగునీటికి వినియోగించేలా సేవకులను ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈవోను సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఉద్యానవనాలు పార్కింగ్ ప్రదేశాల్లో చలువ పందిళ్లు విస్తృతంగా వేయాలన్నారు. భక్తుల రద్దీ కనుగుణంగా మొబైల్ టాయిలెట్లు, షవర్ బాతులు ఏర్పాటు చేయాలని ఈవో ను సూచించారు. భక్తులెవరూ బహిర్భూమికి వెళ్ళకుండా దేవస్థాన పరిపాలన సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. హోటళ్ళలో విక్రయించే తినుబండరాలను శ్యాంపిల్స్ ను సేకరించి తనిఖీ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని జెసి సూచించారు.
అనంతరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉగాది ఉత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎ.పద్మజ, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, డి సి హెచ్ ఎస్ జఫ్ఫురుల, డిపిఓ మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.