-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల మంది పెన్షన్‌దారులకు 1 లక్ష 25 వేల మంది సచివాలయ సిబ్బంది పెన్షన్లను సకాలంలో ఎందుకివ్వలేరు? జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్ల పంపిణీని ఆలస్యం చేస్తోంది. పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి వైసిపి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలి. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కాని పలు ప్రాంతాల్లో వైసిపి నేతలు చెప్పగానే పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామాలు చేసి, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసిపి నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? లేక వైసిపి కార్యకర్తలా? అని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్‌రెడ్డి కుయుక్తులను రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి. రానున్న ఎన్నికల్లో జగన్ సర్కార్‌కు ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని కోరుతున్నామన్నారు.