– అర్బన్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఎథికల్ ఓటింగ్‌కు చర్యలు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రజాస్వామ్య విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని.. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా, వినూత్నంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమంలో భాగంగా గురువారం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఈవీఎం-బ్యాలెట్ యూనిట్ నమూనాను కలెక్టర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్ భవానీ శంకర్, సీనియర్ సిటిజన్స్ ఐకాన్ డా. జి.సమరం, స్వీప్ నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు, అడిషనల్ కమిషనర్లు ఎ.మహేష్, సత్యవతి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ అర్బన్ పరిధిలో 85 శాతం వరకు ఓటింగ్ లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో కళాకారులనుకూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను తెలియజేసేందుకు, ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు ఈ నమూనాను ఆవిష్కరించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రలోభాలకు తావులేని వాతావరణంలో ఎథికల్ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతందని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నేను ఓటరు అయినందుకు గర్వపడుతున్నాను.. నేను తప్పకుండా ఓటు వేస్తాను అని చాటిచెప్పేందుకు వీలుగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.