-ఎన్నికల సమర్థవంత నిర్వహణకు పక్కా ప్రణాళిక, శిక్షణ, ఎన్నికల మార్గదర్శకాల అమలు మూల సూత్రాలు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఈఆర్ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు వారి విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలపై అవగాహన కలిగి కార్యా చరణ ప్రణాళికలతో టైం లైన్ నిర్దేశించుకునీ తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అప్పుడే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించగలమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత నోడల్ అధికారులను, ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో, ఈఆర్ఓ లతో కలిసి వారి కార్యాచరణపై, చేపట్టిన ఎన్నికల విధులపై విస్తృత సమీక్ష సమావేశం నిర్వహిస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఆర్ఓ లకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేసి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారికి సంబంధించిన విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, టైం లైన్ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు సకాలంలో పూర్తి చేస్తూ అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. తాను సుమారు నాలుగు ఎన్నికలలో పని చేసిన అనుభవం ఉందని, ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. సిఈఓ కార్యాలయానికి పంపాల్సిన రోజువారి, వారాంతపు నివేదికల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
మ్యాన్ పవర్ నోడల్ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి, మెటీరియల్, ట్రాన్స్ పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవిఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్ష్పెండిచర్, బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలెక్టోరల్ రోల్స్, ఓటరు హెల్ప్ లైన్, అబ్జర్వర్స్, మీడియా, సక్షం నోడల్ అధికారి తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల హ్యాండ్ బుక్ మేరకు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రావడం జరుగుతుందని, ఎలక్టరల్ రోల్ సరఫరా, బ్యాలెట్ ప్రింటింగ్, వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ వంటి అంశాలపై సిద్ధం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూంలు సన్నద్ధతగా పూర్తి స్థాయిలో భద్రత ప్రమాణాలు మేరకు ఏర్పాట్లు ఉండాలని, అబ్జర్వర్స్ ప్రోటోకాల్ అధికారి వారి విధులను నిర్వహించాల్సి ఉంటుంది అని అన్నారు. స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ఓటర్ టర్న్ ఔట్ గత సార్వత్రిక ఎన్నికలు 2019 లో తక్కువతో పోలింగ్ జరిగిన కేంద్రాల్లో పోలింగ్ కేంద్ర స్థాయి వరకు మరిన్ని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు రూపకల్పన చేసి చేపట్టాలని స్వీప్ నోడల్ అధికారికిసూచించారు. ఈఎస్ఎంఎస్ సీజర్ వివరాలు ఒకే రకమైన నివేదిక ఉండేలా పోలీస్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎప్పటికప్పుడు అమలు, వాటి పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధులను అందరూ నోడల్ అధికారులు అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు.
ఈఆర్ఓ లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ర్యాంపు, త్రాగు నీరు, వెలుతురు తదితర కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరు అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు నడుచుకోవాలని కోరారు. తమ ఎన్నికల బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కొరకు చేపడుతున్న మంచి కార్యక్రమాల వివరాలను ప్రస్ఫుటంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు వారి కార్యాలయాల్లో పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పర్యవేక్షణ ఏర్పాట్లు చేసుకుని సమర్థవంతంగా పారదర్శక ఎన్నికలకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సమర్థవంత నిర్వహణకు పక్కా ప్రణాళిక, శిక్షణ, ఎన్నికల మార్గదర్శకాల అమలు మూల సూత్రాలనీ తెలిపారు. సమన్వయంతో జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ కంకణ బద్దులై పని చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు, ఈఆర్ఓలు ధ్యానచంద్ర, అదితి సింగ్, నిషాంత్ రెడ్డి, నరసింహులు, రాంమోహన్, ఎలక్షన్ సెల్ సిబ్బంది, తదితర అధికారులు పాల్గొన్నారు.