– విజయవంతంగా ఐఏఐసీఎస్ 3వ హ్యాండ్స్-ఆన్ క్యాథ్ స్కిల్స్ వర్క్ షాప్
– ఘనంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం
– ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ (ఐఎన్ఎఐసిఎస్) ఆవిర్భావం
– దేశ విదేశాల నుంచి ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణుల హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుండె శస్త్రచికిత్సల్లో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని, నూతన విధానాలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలందించే దిశగా వైద్యులకు ప్రోత్సాహమందించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ (ఐఏఐసీఎస్) కృషి చేస్తోందని.. ఐఏఐసీఎస్, ఐఎన్ఎఐసిఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు. ఐఏఐసీఎస్ తొలి వార్షికోత్సవం నగరంలోని తాజ్ వివంతా హోటల్లో శనివారం జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3వ హ్యాండ్స్-ఆన్ క్యాథ్ స్కిల్స్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యశాలలో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. వివిధ శస్త్రచికిత్సలకు సంబంధించి వైద్యులకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గుంటూరు వరుణ్ ప్రసంగిస్తూ.. ప్రపంచస్థాయి గుండె శస్త్రచికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. ఐఏఐసీఎస్ వేదిక ద్వారా, ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి గుండె శస్త్రచికిత్సా నిపుణులకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తద్వారా అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో సైతం విజయవంతంగా చికిత్సలను అందించగలుగుతారని తెలిపారు. ఐఏఐసీఎస్ సేవలను ప్రపంచ స్థాయిలో విస్తృతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ (ఐఎన్ఎఐసిఎస్)ను ప్రారంభించామని డాక్టర్ వరుణ్ ప్రకటించారు. నూతనంగా ఆవిర్భవించిన ఐఎన్ఎఐసిఎస్ ప్రెసిడెంట్ గా ముంబయికి చెందిన డాక్టర్ జైనలబెడిన్ హమ్దులే, వైస్ ప్రెసిడెంట్ గా కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ ప్రశాంత్ వైజయనాథ్, జనరల్ సెక్రటరీగా విజయవాడ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ అధినేత డాక్టర్ గుంటూరు వరుణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ ప్రశాంత్ వైజయనాథ్ ఐఏఐసీఎస్ అధ్యక్షోపన్యాసం చేయగా, డాక్టర్ సీ.ఎస్. హిరామత్ ఐఏసీటీఎస్ అధ్యక్షోపన్యాసం కావించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ జవాలి, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ జయకృష్ణన్, డాక్టర్ ఉగల్ కిషోర్ మిశ్రా, డాక్టర్ వినీత్ మహాజన్, డాక్టర్ రెహాన్, కేఎంయు చైర్మన్ డాక్టర్ చలసాని ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.