– సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన జేసీ సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్, మైలవరం ఆర్‌వో పి.సంపత్ కుమార్ వివిధ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, మూలపాడు, త్రిలోచనపురం, తుమ్మలపాలెం, గుంటుపల్లి గ్రామాల్లోని 16 పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. శనివారం మైలవరం మండలం వెల్వడం గ్రామంలోని ఆరు పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. మైలవరం మండలంలోని మొరుసుమిల్లి అంతర్రాష్ట్ర బోర్డర్ చెక్‌పోస్టును కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రలోభాలకు తావులేని, స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేయడం జరుగుతోందని.. ఇందులో భాగంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించి.. చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా చర్యలు, వెబ్‌క్యాస్టింగ్ తదితరాలపై మార్గనిర్దేశనం చేస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను పటిష్టం చేయడం జరిగిందని.. నగదు, మద్యం, గంజాయి తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.