– ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ) తదితర మార్గాల ద్వారా 1,156 ఫిర్యాదులు రాగా 1,142 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఓటరు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 186 ఫిర్యాదులు రాగా 184 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయిందన్నారు. ఎన్జీఎస్పీ ద్వారా 347 ఫిర్యాదులు రాగా అన్ని ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. అదే విధంగా వాట్సాప్ నంబరు (9154970454) ద్వారా 27 ఫిర్యాదులు రాగా 27 ఫిర్యాదులు, కాల్ సెంటర్ (0866-2570051) ద్వారా 22 ఫిర్యాదులు రాగా 22 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా 50 ఫిర్యాదులు రాగా 45 ఫిర్యాదులను, సీఈవో మెయిల్స్ ద్వారా 13 ఫిర్యాదులు రాగా 10 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా 451 ఫిర్యాదులు రాగా వాటిని క్షుణ్నంగా పరిశీలించి అన్నింటిని పరిష్కరించినట్లు వెల్లడించారు.
తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి 55 సీ-విజిల్ ఫిర్యాదులురాగా.. విజయవాడ పశ్చిమకు సంబంధించి 6, విజయవాడ సెంట్రల్‌కు సంబంధించి 58, విజయవాడ తూర్పునకు సంబంధించి 73, మైలవరంకు సంబంధించి 18, నందిగామకు సంబంధించి 134, జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి 103 ఫిర్యాదులు, ఇతర పోలింగ్ స్టేషన్ల పరిధి నుంచి 4 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. 60 ప్రతికూల వార్తలకు సంబంధించి 56 అంశాలపై తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి నాణ్యతతో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.