-యువతకు నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము
-వాలంటీర్లకు అండగా నిలబడతాం
-కోనసీమలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ. 30 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. లక్షా 50 వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ…. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లు కల్పిస్తాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతాం. చట్టబద్ధంగా కులగణన చేస్తాం. బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ కింద రూ. 5వేల కోట్లు ఖర్చు పెడతాం. చంద్రన్న బీమా రూ. 10 లక్షలకు పెంచుతాం. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. సిద్ధం అంటున్న జగన్ రెడ్డికి మర్చిపోలేని యుద్ధం ఇవ్వబోతున్నాం. దానికి మీరు సిద్ధమా ? అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. సామాజిక న్యాయమే మా అజెండా అని అన్నారు. మా అజెండా ఒకటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం అని అన్నారు. రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయ్. జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం అని అన్నారు.
‘కొబ్బరి నీళ్లు ఎంత తీయగా ఉంటాయో కోనసీమ వాసుల మనసులూ అంతే తీయగా ఉంటాయి. వారి ఆప్యాయతలు అంతే అద్భుతంగా ఉంటాయి. కోనసీమగా… కొబ్బరి సీమగా… ప్రేమ సీమగా పేరున్న ఈ ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ ప్రభుత్వం పన్నాగం పన్నింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. మనుషుల మధ్య అంతరాలు పెంచి, కులాల కుంపట్లు ఎగదోసి, సొంత మంత్రి ఇంటిని తలగబెట్టించి మరీ ఈ ప్రాంతంలో చిచ్చురేపాలని ప్రయత్నించిందన్నారు. పోలీసు కేసులతో, దాడులతో ఈ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని, అప్పట్లో జనసేన పార్టీ సకాలంలో స్పందించి, అంతా సంయమనం పాటించేలా చొరవ తీసుకుందని తెలిపారు. వైసీపీ కుట్రతో రేగిన అల్లర్లను నిరోధించి, అంతా సర్దుమణిగేలా జనసేన పార్టీ చూసిందని, ఆనాటి చేదు జ్ఞాపకాలు కోనసీమ వాసులను వెంటాడుతున్నాయి అన్నారు. వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా గురువారం పి.గన్నవరం నియోజక వర్గంలోని అంబాజీపేటలో నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత అయిదేళ్ల నుంచి ఇప్పటి వరకు దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. అల్లర్లు రేపి, శాంతిభద్రతలను నాశనం చేసి పరిపాలించిన వైసీపీని చూశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యతను ప్రజలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం ద్వారా సరికొత్త రాష్ట్ర భవిష్యత్తు ఆవిష్కారం అవుతుంది. శాంతి భద్రతలు బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. బలమైన వ్యక్తులంతా ప్రజల కోసం పని చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. వైసీపీ ప్రచారం చేస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం వస్తే ఏ సంక్షేమ పథకం ఆగిపోదు. ఇప్పుడున్న దాని కంటే పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచిస్తాం. దీన్ని ప్రజలు మనస్ఫూర్తిగా నమ్మండి. ఏ అధికారం లేనప్పుడే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను సొంత డబ్బుతో ఆదుకున్న వాడిని. ప్రజా ధనం వారికే చెందేలా చూసే బాధ్యత తీసుకుంటాను.
గంగా బొండం రకం మొక్కలు రైతులకి అందుబాటులో ఉంచుతాం
కోనసీమ ప్రాంతంలో 2.5 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నప్పటికీ కోకోనట్ బోర్డు ఏర్పాటు అవసరం ఉంది. కేరళ తరహాలో కొబ్బరి పంటను పూర్తిస్థాయిలో వినియోగించుకునే కొబ్బరి అనుబంధ పరిశ్రమలు కోనసీమలో రావాలి. కొబ్బరి పీచును రోడ్డు నిర్మాణంలో వాడతారు. దీనివల్ల కొబ్బరిపీచుకు కేరళలో డిమాండు ఉంది. అలాంటి పరిశోధనలు వల్ల కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడి కొబ్బరి రైతులకు పూర్తిస్థాయి గిట్టుబాటు ధర లభిస్తుంది. వైసీపీ పాలనలో ఇక్కడి కొబ్బరి రైతులకు ఎంతో అవసరం అయ్యే గంగా కొబ్బరిబొండాల మొక్కలు ఇవ్వటం లేదని తెలిసింది. కొందరు వైసిపి వాళ్లకు మాత్రమే అవి అందుతున్నాయని చెబుతున్నారు. రాబోయే ప్రభుత్వంలో కొబ్బరి రైతులకు ఏం చేస్తే బాగుంటుందనే దానిపై లోతైన చర్చ చేసి, వారి ఉన్నతికి తగిన విధంగా తోడ్పడతాం. గంగా బొండం రకం మొక్కలు రైతులకి అందుబాటులో ఉంచుతాం. గతంలో వేయి కాయలు వచ్చే చెట్టుకు నేడు కేవలం 200 కొబ్బరి కాయలు వస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. రైతు కన్నీళ్లు తుడిచే కూటమిగా పాలన సాగిస్తాం అని హామీ ఇస్తున్నాను.
డాన్ ఆటకట్టిస్తాం
రాష్ట్రంలో జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ లను చట్టానికి అప్పగిస్తాం. ఇక్కడ కూడా రైతు భరోసా కేంద్రాలను తన గుప్పిట్లో పెట్టుకున్న అతి పెద్ద డాన్ ఉన్నాడు. వారిందరినీ తగిన విధంగా బుద్ది చెబుతాం. ప్రాంతాలు, కులాలు, వర్గాలు వదిలి ప్రజలు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. నన్ను తిట్టడానికి నా కులం నాయకులను, బీసీ నాయకులను, ఎస్సీ నాయకుల్లో కొందరిని జగన్ వాడతాడు. ప్రజలకు మంచి చేయాలని అన్ని వదులుకొని వచ్చినా, నన్ను రకరకాలుగా దుర్భాషలాడుతున్నారు. ప్రజల బాగు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని మాటలు అయినా పడటానికి సిద్ధంగా ఉన్నాను.
అంబేద్కర్ పేరును తీసేసి.. జగన్ పేరు పెట్టుకున్నాడు
ఎస్సీలకు ఉన్నత విద్య అందాలని, విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని గత ప్రభుత్వంలో పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును మార్చి జగన్ తన పేరు పెట్టుకున్నారు. పోని పథకాన్ని అయినా సరిగా అమలు చేశారంటే అదీ లేదు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ పేరు మళ్లీ తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాం. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన సర్ అర్ధర్ కాటన్ వారసుల్లా కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు పనిచేస్తారు. చివరి ఎకరా వరకు నీరు అందించేలా చూస్తాం. రైతులకు గిట్టుబాటు ధర, యువతకు ఉద్యోగాలు, మహిళలకు రక్షణ అందే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం.
జగన్ హామీలన్నీ గోదాట్లోకి వెళ్లాయి
నాడు- నేడు రెండో దశ పనులను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. 2021, ఆగస్టు 16న పనులను ప్రారంభిస్తూ ఇక్కడి సమస్యల పరిష్కారం కోసం వరాలు కురిపించారు. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని దానికోసం రూ.40 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి రాలేదు. వెదురుబీడెం కాజ్ వే నిర్మాణం నిమిత్తం రూ.25 కోట్లు విడుదల చేస్తానని హామి ఇచ్చారు. ఇప్పటి వరకు నిధులు రాలేదు. 2022 జూలైలో గోదావరికి వరదలు వచ్చిన సందర్భంగా లంక గ్రామాల్లో సీఎం పర్యటిస్తూ రూ.30 కోట్లుతో గట్లను పటిష్టీకరిస్తామని చెప్పారు. రూపాయి ఇవ్వలేదు. 2023, ఆగస్టులో మరోసారి గోదావరి వరద వచ్చినపుడు రూ.200 కోట్లతో మొత్తం గోదావరి గట్లన్నీ పూర్తిస్థాయిలో పటీష్టికరణ చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు డబ్బులు విడుదల చేయలేదు. ఆఖరికి గెయిల్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బులిటీ లోల్ కింద అగ్నిమాపక వాహనం కొనిస్తే, దానికి ఓ భవనం కట్టలేదు. సిబ్బందిని ఇవ్వలేదు. ఇదీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసిన మంచి… వారు చేసిన అభివృద్ధి.
యువతకు నైపుణ్యాన్ని అందిస్తాం.. వారికి భవిత చూపిస్తాం
2047 మోదీ విజన్ మేరకు యువతకు అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం కల్పించడం ద్వారా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటాం. పెరుగుతున్న గ్లోబలైజేషన్ ను అందిపుచ్చుకొని వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు తీసుకొస్తాం. మా అన్నయ్య చిరంజీవి నాకు నటనపై స్కిల్ నేర్పించినట్లుగానే రాష్ట్రంలోని యువతకు ఏ రంగంలో అభిరుచి ఉందో సర్వే చేసి దాని ద్వారా వారికి సరైన నైపుణ్యం అందిస్తాం. దీని ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. బైబిల్ లో చెప్పినట్లుగా యువతకు చేపలు ఇవ్వడం కాదు.. చేపలు పట్టడం నేర్పించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
వాలంటీర్లకు అండగా నిలబడతాం
వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లంతా తప్పు చేశారని నేనెప్పుడూ అనలేదు. కొందరు చేసిన పని వల్ల చెడ్డ పేరు అందరికీ వస్తోందని మాత్రమే చెప్పాను. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు వారికి రూ.10 వేల వేతనం ఇచ్చి, ప్రజలకు మేలు చేసే పనులకు వారిని ఉపయోగిస్తాం. రాజకీయాలకు అతీతంగా వారితో పని చేయించే బాధ్యత తీసుకుంటాం. ఇలా పని చేసేవారికి కచ్చితంగా మేం అండగా నిలబడతాం. వాలంటీర్ల కడుపుకొట్టేలా ఎలాంటి చర్యలు ఉండవు. ముఖ్యంగా కోనసీమలో రైలు కూత వినిపించాలనేది దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోరిక. దాన్ని సాకారం చేసేలా కోనసీమకు రైలు మార్గం కోసం ప్రయత్నం చేస్తాం. ప్రజలంతా ఉమ్మడిగా గెలవాలనే కోరికతోనే నాయకులంతా సాధ్యమైనంత మేరకు తగ్గించుకున్నాం. కాస్త తగ్గినా ప్రజలు గెలవాలన్నదే మా లక్ష్యం. ఈ ప్రభుత్వాన్ని తరమి కొట్టి, ప్రజల జీవితాల్లో వెలుగులు పంచాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. చిన్నచిన్న కోపాలకు, ఈగోలకు పోకుండా క్షేత్రస్థాయిలో నాయకులంతా కలిసి పనిచేయాలి. కేవలం దూర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమిని గెలిపించుకోవాలి. మూడు పార్టీల్లోనూ ఓటు బదిలీ తప్పకుండా జరగాలి’’ అన్నారు. ఎమ్మెల్యేగా గిడ్డి సత్యనారాయణ నీ, ఎంపీగా గంటి హరీష్ ని గెలిపించాలని కోరారు.