Breaking News

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు

-3 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈవో కోటేశ్వరరావును రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు శుక్రవారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైసీపీపై అస్తమాను బురదచల్లడం, ముఖ్యమంత్రిని దుర్భాషలాడటమే చంద్రబాబు, కూటమి నేతల పనిగా మారిపోయిందన్నారు. బహిరంగ సభలలో సీఎం జగన్ పై పదేపదే నోరుపారేసుకుంటూ.. రోజూ ఏదో ఓచోట ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. అల్పాహారంగా ఇసుక, మధ్యాహ్న భోజనంగా మద్యం, రాత్రి గనులను భోజనం చేస్తారని.. ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే ముఖ్యమంత్రిని జైలుకు పంపిస్తామని., జైలుకు, బెయిల్ కు మధ్య జగన్ ఊగిసలాడుతున్నారని అమలాపురం సభలో జనసేన అధినేత మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదును అందించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక.. కూటమి నేతలు ఇలా పిచ్చిపిచ్చి ప్రేలాపణలు చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత వ్యాఖ్యలు వింటుంటే స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత ఎన్నికలలో వైసీపీని ఢీకొని పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు.. ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడే అర్హత ఉందో లేదో..? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సీఎం జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన వారంతా రాజకీయ సమాధి అయ్యారని.. ఈ ఎన్నికలతో కూటమి నేతలకూ అదే గతి పట్టడం ఖాయమని హెచ్చరించారు.

టీడీపీవి హింసా రాజకీయాలు
ఓటమి భయంతో రాష్ట్రంలో తెలుగుదేశం హింసా రాజకీయాలకు ప్రోత్సహిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. మచిలీపట్నం, ఒంగోలు, పల్నాడు సహా పలు చోట్ల చోటుచేసుకున్న భయానక ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. అలాగే అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ, బెదరించేలా.. కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతల ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం అధికారులకు ఏముంటుందని ప్రశ్నించారు. 30 మంది పింఛన్ దారుల మరణాలను అధికారులు, వైసీపీ ఖాతాలో వేయాలనే కుట్రలో తెలుగుదేశం చివరకు అభాసుపాలైందన్నారు. ప్రజలు విజ్ఞులు కనుక మీ కుతంత్రాలను ముందుగానే గ్రహించారన్నారు. గతంలో గోదావరి పుష్కర మరణాల విషయంలోనూ బాబు ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తుచేశారు.

ఇసుకపై బోగస్ ప్రచారం
ఇసుక గూర్చి, భవన నిర్మాణ కార్మికుల గూర్చి కూటమి నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బాబు పాలనలో అడ్డగోలు ఇసుక దోపిడీ జరిగినట్లు 2019 ఏప్రిల్ 4 న సాక్షాత్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేసిందన్నారు. పైగా ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా గూర్చి పచ్చ పత్రికలలోనే అనేక కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. మీ ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందని.. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు నేటికీ భరించాల్సి వస్తోందన్నారు. కనుకనే ప్రజలలో తిరుగుబాటు వచ్చి పవన్, లోకేష్ సహా అప్పటి మంత్రులందరినీ చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. ఈసారి ఎన్నికలలోనూ అవే ఫలితాలు పునరావృతం కావడం ఖాయమని.. కూటమి నేతలకు గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *