– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ఈనెల 13న జరగనున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు షోను జయప్రదం చేయాలని ప్రజలను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2019లో ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయం.. నగర సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని మల్లాది విష్ణు అన్నారు. రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, సబ్ స్టేషన్లు, ఆర్.ఓ.బి.లు, ఆర్.యు.బి.లు., నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణంతో ఐదేళ్లలో విజయవాడ రూపే మారిపోయిందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే రూ. 866.84 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామ/ వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా లంచాలు, వివక్ష లేని పాలనకు తెరదీసి.. నియోజకవర్గ పరిధిలో 1,44,012 మందికి అక్షరాల రూ.1,063.60 కోట్ల సంక్షేమాన్ని అందించడం జరిగిందన్నారు. గత 58 నెలలుగా మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్, అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల సంక్షేమం, పేద సామాజికవర్గాలకు అందిన మేలును ప్రజలందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలన్నారు. దుష్ట కూటమి కబంధ హస్తాలలోకి మరలా నగరం వెళ్లకుండా జాగ్రత్తపడాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అఖండ మెజార్టీతో గెలుపునందించాలన్నారు. పేదవాడికి అండగా, మనందరి ప్రభుత్వానికి తోడుగా, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు.. ముఖ్యమంత్రి రోడ్డు షోకు సంపూర్ణ మద్ధతు అందించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.