-ఆరునెలల నిబంధన అమలైతే నలుగురు ఔట్
-డిల్లీ నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపని మరో ఇద్దరు
-మిగిలిన ఐదుగురిలో సిసోడియా వైపే మొగ్గు చూపుతున్న ఇసిఐ ?
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది, రాజకీయ పార్టీల ఎత్తుగడలు ప్రారంభం అయ్యాయి. వ్యవస్థలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు సామ, దాన, బేథ, దండోపాయాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో అధికారుల బదిలీలు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్ర స్ధాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించేది ప్రధాన ఎన్నికల అధికారి కాగా, తరువాత గుర్తుకు వచ్చేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇంటిలిజెన్స్ ఛీఫ్ వంటి వారు. ఎన్ డిఎ కూటమి ఇప్పటికే వీరందరి పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. అధికార పార్టికీ అంటకాగుతున్నారన్న విమర్శలు బలంగా చేస్తున్నారు. మరోవైపు బిజెపితో పొత్తు ఫలితంగా కూటమికి వ్యవస్థలపై పరోక్షంగా బలం చేకూరినట్టు అయ్యింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఇప్పటి వరకు అధికార పక్షానికి గుడ్డిగా సానుకూలత ప్రదర్శించిన వారి మార్పుకు సంబంధించి చర్చలు వేగవంతం అయ్యాయి.
ప్రస్తుతం సిఎస్ గా జవహర్ రెడ్డి వ్యవహరిస్తుండగా, తెలుగు దేశం, జనసేన, బిజెపి కూటమి పక్షపాత రహితంగా వ్యవహరించగలగిన అధికారి కోసం సమాలోచనలు చేస్తోంది. సిఎస్ మార్పు తప్పనిసరి అని కూటమి బలంగా నమ్ముతుండగా, సమర్ధుడు, నిజాయితీ పరుడైన అధికారి కోసం లోతైన అధ్యయనం జరుగుతోంది. ప్రస్తుత సీఎస్ కోడ్ వచ్చిన తరువాత కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ , కలెక్టర్ల మార్పుకు సంబంధించి పంపిన ప్యానెల్ లిస్ట్ వ్యవహారం తదితర అంశాలలో అధికార పక్షానికి మేలు చేసారని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిత్యం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో సీఎస్ మార్పు తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. సీనియారిటీ పరంగా తొలి పది స్ధానాలలో ఉన్న వారిని పరిశీలిస్తే ఎక్కువ మంది రానున్న ఈ నెలాఖరు నుండి అరు నెలల వ్యవధిలో పదవీ విరమణ చేయబోతున్నారు. నిబంధనల ప్రకారం ఆరునెలల పదవీకాలం మించి ఉన్నవారిని మాత్రమే సిఎస్ లుగా నియమించే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం 2023 డిసెంబర్ 21 తేదీన నెం :437/6/1/ఐఎన్ఎస్ టి/ఇసిఐ/ఎఫ్ యుఎన్ సిటి/ఎంసిసి/2023 పేరిట జారీ చేసిన ఉత్తర్వులలోని 6(VI)ని అనుసరించి అరునెలలలోపు పదవీ కాలం ఉన్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. జిల్లాలకు కలెక్టర్ ఏతీరుగా జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారో అదే తీరుగా సిఎస్ రాష్ట్ర స్దాయిలో వ్యవస్ధలను పర్యవేక్షిస్తుంటారు. కేంద్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన ఉత్తర్వుల అధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆరునెలల పదవీ విరమణ షరతును ఉటంకిస్తూ 2024 జనవరి 1న రాష్ట్ర స్ధాయిలో ఉత్తర్వులు జారీచేసారు. వీటి అధారంగానే తిరుపతి కలెక్టర్ బదిలీ జరిగింది.
సీనియారిటీపరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో కీలక విధులలో ఉన్న గిరిధర్, సుమిత్రా దావ్రా తదితరులు ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా లేరని సమాచారం. ఆరు నెలల లోపు పదవీ విరమణ పొందే వారిలో నీరభ్ కుమార్ ప్రసాద్ (1987), పూనం మాలకొండయ్య (1988), కె. ప్రవీణ్ కుమార్ (1990), రజత్ భార్గవ (1990) ఉన్నారు. నిబంధనలను అనుసరించి వీరికి అవకాశం వచ్చే పరిస్ధితి లేదంటున్నారు. సినీయారటీ పరంగా రెండో స్దానంలో ఉన్న శ్రీలక్ష్మి , ఏడోస్ధానంలో ఉన్న అనంతరాము, 1991 బ్యాచ్ కు చెందిన అజయ్ జైన్, ఆర్ పి సిసోడియా, జి.సాయి ప్రసాద్ ల పేర్లను మాత్రమ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజస్ధాన్ కు చెందిన సిసోడియా నాన్ లోకల్ కావటం కలిసి వచ్చే అంశంగా ఉంది. మరోవైపు కేంద్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల నియమావళి పట్ల అవగాహన మెండు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేయటం ద్వారా రాజ్యాంగ బద్ధమైన సంస్ధలలొ మంచి అనుభవం గడించారు. మరోవైపు ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల వేళ సిసోడియాకు సిఎస్ పదవి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి ఆయన ఏ రాజకీయ పార్టీతో ఆయన అంటకాగిన సందర్భాలు సైతం కానరావు. కేంద్ర ఎన్నికల కమీషన్ సైతం పార్టీలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తికే అవకాశం ఇచ్చే పరిస్దితి ఉంటుంది. ఎన్నికల వేళ అధికారుల స్దాన చలనం పరంగా ఏమి జరగనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో శ్రీరామనవమికి ముందే నూతన సిఎస్ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని డిల్లీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.