Breaking News

ఇండియా కూటమికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను కలిసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణను కలిసి, ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణను కలిసిన వారిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు జి కుమార్‌ చౌదరి, నాయకులు వీరేందర్‌, గౌరీ శంకర్‌, గోపాలకృష్ణ, రాహుల్‌, వేణుచారి, కృష్ణ తదితరులున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల మనిషిగా సిపిఐ తరఫున పోరాడుతున్న రామకృష్ణను అభినందించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సాగిన ఉద్యమాలను కొనియాడారు. గత నాలుగున్నరేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌ నియంత చేతుల్లో చిక్కిందని, ఎపీలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల రంగాల అభివృద్ధి అటకెక్కిందన్నారు. ఆంధ్రాను అప్పులప్రదేశ్‌గా మార్చారన్నారు. గత ఎన్నికల్లో 25 మంది వైసిపి ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా కేంద్రం మెడలువంచి ఎపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక మాటతప్పి మడమ తిప్పారని విమర్శించారు. ఎపీకి ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీల అమలు కేవలం ఇండియా కూటమితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘ఇండియా కూటమి గెలుపు`ఎపీ అభివృద్ధికి మలుపు’గా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ప్రజా కంటక పాలన నుండి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కలిగించేందుకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇండియా కూటమికి సంపూర్ణ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షులు జి కుమార్‌ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పురోభివృద్ధికోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. ఇండియా కూటమి బలపరచిన అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *