-రెండు పార్టీలకు బీసీవై పార్టీ సమాన దూరం
-నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేసిన రామచంద్ర యాదవ్
-నియోజకవర్గంలోని ప్రతి రైతుకీ ఒక ఆవు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని పరిరక్షణ కోసం తాను మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలిపారు. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన, ఇటు మంగళగిరిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పైనా పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మంగళరిగిలోని హ్యాపీ రిసార్ట్స్ నందు నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు, ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ అటు పుంగనూరులో, ఇటు మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (వైసీపీ, టీడీపీ) సమదూరమని చెప్పారు. అందుకే వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న పెద్దిరెడ్డిపై, ఇటు టీడీపీలో నెంబర్ 2 గా ఉన్న నారా లోకేష్ పై బరిలో దిగినట్లు తెలిపారు. అంతే కాకుండా సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. రాజధాని పరిరక్షణ కోసం మంగళగిరి నుండి బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు రామచంద్ర యాదవ్. ఇందు కోసం నియోజకవర్గ మేనిఫెస్టోను రామచంద్ర యాదవ్ విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
ASK _RCY నెల రోజుల ఉపాధి – ఉద్యోగం గ్యారంటీ పథకం అమలు
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు నెల రోజుల్లో ఉద్యోగం లేదా ఉపాధి హామీ కల్పించే లక్ష్యంతో ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పారు. ఈ పథకం ద్వారా ఆర్సీవై కాల్ సెంటర్ కి కాల్ చేసి పేరు నమోదు చేసుకున్ వారికి నెల రోజుల్లో ఉద్యోగం లేదా ఉపాధి కల్పించబడుతుందని హామీ ఇచ్చారు. చేనేతలకు అండగా ఉండేందుకు మంగళగిరి కేంద్రంగా చేనేత పరిశ్రమ ఏర్పాటు చేయించడంతో పాటు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా భారీ టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటునకు కృషి చేస్తామని తెలిపారు. అయిదేళ్లలో 25వేల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలానే పతంజలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా స్థానికంగా 20వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
రాజధాని ప్రాంతంలో 25వేల మంది పేదలకు పక్కా గృహాలు
25వేల మంది పేద కుటుంబాలకు రాజధాని (సీఆర్డీఏ) ప్రాంతంలో పక్కా గృహాల నిర్మాణం చేపడతామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 20వేల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక పారిశ్రామికవాడ (జాతీయ పెట్టుబడుల, ఉత్పాదక మండలి) ఏర్పాటునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో డ్రైయినేజీ సమస్య లేకుండా.. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో పక్కా డ్రైయిన్ల నిర్మాణం చేపడతామన్నారు.
*దుగ్గిరాల మండలం రవీంద్రపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఆ ప్రాంత రైతులకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. నిడమర్రు రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ (వంతెన) నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.