-ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నిర్వహణలో అత్యంత ముఖ్యమైన పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో) కీలకమని.. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను పీవోలు, ఏపీవోలు సద్వినియోగం చేసుకొని, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. శనివారం నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ డిల్లీరావు ప్రారంభించి మాట్లాడారు. పోలింగ్ రోజుకు ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి తిరిగి పోలింగ్ పూర్తిచేసుకుని రిసెప్షన్ సెంటర్ వరకు అన్ని అంశాలపైనా క్షుణ్నంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఇచ్చే శిక్షణను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. ఏ సందేహమున్నా మాస్టర్ ట్రైనర్ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో క్రమశిక్షణతో నిబద్ధతతో శిక్షణ పొందాలని.. పోలింగ్ మెటీరియల్, పోలింగ్ పార్టీలు, పోలింగ్ ఏజెంట్లు, రూట్లు, సెక్టార్లు, పీవో డెయిరీ, పీవో రిపోర్టులు, ఫొటోఎలక్టోరల్ రోల్, పీబీ మార్కింగ్, పోలింగ్ స్టేషన్ లేఅవుట్, పోలింగ్ ప్రక్రియ, ఈవీఎం క్లోజ్ బటన్ ప్రాధాన్యం తదితర అంశాలపై ప్రాక్టికల్ అప్రోచ్‌తో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పీవోలు నిర్వహించాల్సిన రిజిస్టర్లు, ఫారాలు తదితరాల వివరాలను క్షుణ్నంగా తెలుసుకోవాలన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు. శిక్షణ కార్యక్రమంలో కేఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆర్‌వో కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.