విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్ అంబేద్కర్ కు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ డా. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ పాత్ర మరువరానిదని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు.
స్థానిక స్వరాజ్ మైదాన్ లోని 125 అడుగుల భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ప్రాంగణంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫుట్కర్ లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ గొప్ప దేశభక్తి,మానవతా విలువలు కలిగిన డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్ప దార్శనికుడు అని పేర్కొన్నారు. వారిఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరు విద్యావంతులై అభివృద్ధి చెందాలన్నారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ డా.బి.ఆర్.అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకోవాలన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపరిచారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫుట్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ
డా.బి.ఆర్.అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు.
అనంతరం సందర్శకులు, ప్రాజెక్ట్ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెసిపి ప్రాజెక్ట్ అధికారులు, సామాజికవేత్తలు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.