-జన ప్రవాహంతో కిక్కిరిసిన పుర వీధులు
-జయహో జనసేనాని అంటూ నినదించిన జనం
-పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన తెనాలి ప్రజానీకం
-రెండున్నర గంటలపాటు పవన్ కళ్యాణ్ రోడ్ షో
-హారతులు, గజమాలలతో స్వాగతించిన జన సైనికులు, వీర మహిళలు
-ఆంధ్రా ప్యారిస్ లో జనసేనాని వారాహి విజయ భేరీ
-పొత్తు గెలవాలి.. జగన్ రెడ్డి పోవాలి అంటూ నినదించిన ప్రజలు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా ప్యారిస్ గా పేరొందిన తెనాలి పట్టణాన్ని- వారాహి విజయ భేరీ సభకు వచ్చిన జన ప్రవాహం ముంచెత్తింది. జన సేనానికి మద్దతుగా దారి పొడుగునా జన సైనికులు, వీర మహిళలు గర్జించారు. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా జనంతో తెనాలి పురవీధులు కిక్కిరిసిపోయాయి. హారతులు, గజమాలలు, జయజయ నినాదాలతో కూడిన ప్లకార్డులతో అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. వారాహిని అధిరోహించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ భేరీ మోగించారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి శాసనసభ జనసేన అభ్యర్ధి నాదెండ్ల మనోహర్, కూటమి గుంటూరు పార్లమెంటు అభ్యర్ధి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లతో పాటు జిల్లా నాయకత్వంతో కలసి ఆంధ్రా ప్యారిస్ అదిరేలా రెండున్నర గంటల పాటు వారాహి వాహనంపై నుంచి రోడ్ షో నిర్వహించారు.
వారాహి విజయభేరీ యాత్ర కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి పట్టణం, సుల్తానాబాద్ వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ కు చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, తెనాలి బీజెపీ ఇంఛార్జి కె. వాసుదేవ నాయుడు స్వాగతం పలికారు. 5.30 గంటలకు జనసైనికులు, వీర మహిళల కేరింతల మధ్య సభా ప్రాంగణానికి బయలుదేరారు. వారాహి విజయభేరీ సభకు తెనాలి పట్టణంతో పాటు చుట్టు పక్కల నియోజకవర్గాల జనసైనికులు, వీర మహిళలు, టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలిరావడతో వారాహి వాహనం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొంతదూరం వాహనంపై రోడ్ షో నిర్వహించి సుల్తానాబాద్ ప్రధాన రహదారి మీద వారాహి వాహనాన్ని అధిరోహించారు. పవన్ కళ్యాణ్ కి మహిళలు హారతులు పట్టారు. పూల వర్షం కురిపించారు. వారాహికి గుమ్మడికాయలతో దిష్టి తీస్తుండగా ముందుకు కదిలారు. పట్టణాన్ని ముంచెత్తిన జనప్రవాహంలో వారాహి అడుగు అడుగు ముందుకు కదలగా ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. రహదారికి చుట్టుపక్కల ఉన్న భవనాలు, చెట్లు, స్థంభాలు మొత్తం జనంతో నిండిపోయాయి. పట్టణం మొత్తం జనసేన జెండాలు, మద్దతుగా తరలివచ్చిన టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రదర్శించిన జెండాలు రెపరెపలాడాయి. జనసేనానికి మద్దతుగా తెనాలి పట్టణం నుంచి రెల్లి సోదరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తమను గుర్తించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మున్సిపల్ ఒప్పంద కార్మికులు సమాన పనికి సమాన వేతనం కల్పించేలా కృషి చేయాలని కోరుతూ తమ సమస్యను ప్లకార్డుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
హల్లో తెనాలి.. బైబై వైసీపీ..
సుల్తానాబాద్, చెంచుపేటల్లో జనసేన శ్రేణులు గజమాలలతో పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. యువత మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అంటూ తమ మొదటి ఓటు జనసేన పార్టీకి వేస్తామంటూ ప్లకార్డులు రాసి ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కి పూల మాలలు వేసేందుకు అభిమానులు పోటీ పడగా చాలా మంది నుంచి మాలలు స్వీకరించి మెడన ధరించి ఉత్తేజపరిచారు. పొత్తు గెలవాలి.. జగన్ పోవాలి అంటూ రాసిన ప్లకార్డులు అడుగడుగునా దర్శనమిచ్చాయి. హల్లో ఏపీ.. బైబై వైసీపీ.. హల్లో తెనాలి.. బైబై వైసీపీ.. అంటూ దారిపొడుగునా మూడు పార్టీల శ్రేణులు నినదించారు.
టీడీపీ, బీజేపీ శ్రేణుల మద్దతు
సుల్తానాబాద్, చెంచుపేట, ఫ్లై ఓవర్ మీదుగా వారాహి విజయ భేరీ యాత్ర మార్కెట్ సెంటర్ కి చేరుకుంది. జనసేన శ్రేణులతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా వారాహి యాత్రకు మద్దతుగా పెద్ద ఎత్తున తెనాలి తరలివచ్చాయి. జనసేన, టీడీపీ రంగులతో కూడిన బెలూన్లు ప్రదర్శిస్తూ జయజయ ధ్వానాలు చేశారు. మార్కెట్ సెంటర్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ప్రజలు ఆసక్తిగా ఉంటూ, మద్దతుగా నినాదాలు చేశారు.